మహిళలను గౌరవించడమే శ్రేయస్కరం: బౌద్ధ గురువు దలైలామా

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:57 IST)
మహిళలను గౌరవించడమే అన్నివిధాలా శ్రేయస్కరమని బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. ఏపీ రాజధాని అమరావతి, ఇబ్రహీంపట్నంలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినపుడు ఆడ, మగ అనే తేడా లేకుండా చూస్తారు, మరి పెద్దయ్యాక మాత్రం ఈ తేడాలెందుకు అని ప్రశ్నించారు. 
 
విద్యతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలన్నారు. అంతా సమానం అనే భావన చిన్నతనం నుంచే నేర్పాలని దలైలామా సూచించారు. మహిళలు శారీరకంగా సున్నితమైనా, మానసికంగా బలమైన వారని, వారు అన్ని రంగాల్లో వృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
 
ఇకపోతే అమరావతికి తాను రెండోసారి రావడం సంతోషంగా ఉందన్నారు. బౌద్ధ కేంద్రంగా విరాజిల్లిన అమరావతిని రాజధానిగా ప్రకటించడం శుభపరిణామమన్నారు. అలాగే శాంతి ఉన్నచోటే ఆర్థిక పురోగతి ఉంటుందని, మా గురువులందరూ అమరావతి నుంచి వచ్చినవాళ్లేనని దలైలామా అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి