మళ్ళీ టీడీపీలోకి డీఎల్ రవీంద్రా రెడ్డి.. ముమ్మరంగా యత్నాలు

శనివారం, 4 జూన్ 2016 (09:07 IST)
మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆయన రాకను టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో డీఎల్ రవీంద్రారెడ్డి ఒకరు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అన్న నేత. అంత సీనియారిటీ ఉన్నా ఎందుకో డీఎల్‌ రవీంద్రారెడ్డి అత్యున్నత పదవులు వరించలేదు.. కారణం నిత్య అసంతృప్తి వాది కావడమే! 
 
అందుకే డీఎల్‌తో అందరూ దూరంగా ఉండేవారు.. ఎవరైనా కదిలిస్తే కడిగిపారేసేవారు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని బహిరంగంగానే విమర్శించిన డీఎల్‌ అటు పిమ్మట కిరణ్‌కుమార్‌ రెడ్డితో కూడా తగువు పెట్టుకున్నారు.. సాధారణ ఎన్నికలకు ముందు చాలా మంది కాంగ్రెస్‌ నాయకుల్లాగే డీఎల్‌ కూడా హస్తం పార్టీ నుంచి దూరం జరిగారు. రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఇప్పుడు మళ్లీ డీఎల్‌ పేరు ప్రజల నోళ్లలో నానుతోంది.
 
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన డీఎల్‌ వార్తల్లో వ్యక్తి కావడానికి కారణం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో కూడా చర్చించినట్టు సమాచారం. అయితే డీఎల్‌ రాకను ప్రస్తుతం మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ సుధాకర్‌ యాదవ్‌ అడ్డుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీలోకి డీఎల్‌ వస్తే రాజకీయంగా తనకు నష్టం జరిగే ప్రమాదం ఉందని సుధాకర్‌ గట్టిగా భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి