ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడివుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి ఆదివారం సాయంత్రానికి వాయగుండంగానూ, సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు స్టెల్లా వెల్లడించారు. దీని ప్రభావం కారణంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్టెల్లా సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
మరోవైపు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఏపీ హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. శనివారం, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రికి అధికారులు సూచించారు. తుఫాను తీవ్రతను అంచనావేసి ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా, ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికపుడు ప్రజలకు తెలియజేయాలని, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండేలా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని కోరారు.
సహాయక చర్యల కోసం ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800 425 0101 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని కోరారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారిని, లోతట్టు ప్రాంత వాసులను ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించి, అవసరమైన ఆహారం అందించాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.