రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం:జగన్‌

గురువారం, 23 జనవరి 2020 (07:34 IST)
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటవుతాయన్న సీఎం, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా అవి పని చేస్తాయని ప్రకటించారు.

రైతులకు అన్ని విధాలుగా ఆ కేంద్రాలు అండగా ఉంటాయని, వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా చేస్తాయని.. ఇంకా భూసార పరీక్షలు. విత్తనాల నాణ్యత పరీక్ష వంటి సేవలు కూడా అందిస్తాయని తెలిపారు. తేమ కొల్చే మీటర్లు సైతం ఆ కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

రైతు భరోసా కేంద్రాలు రానున్న ఖరీఫ్‌ నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేస్తాయని సీఎం పేర్కొన్నారు.
వ్యవసాయానికి ఇప్పటికే 60 శాతం ఫీడర్ల నుంచి పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, వచ్చే ఖరీఫ్‌ నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్ల నుంచి కూడా ఆ సరఫరా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇందుకోసం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై సభలో చర్చ అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏమేం చేస్తోంది అన్నది ఆయన ఈ సందర్భంగా కూలంకషంగా వివరించారు.
 
రైతు భరోసా కేంద్రాలు
రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు నెలకొల్పామన్న సీఎం, దాంట్లో భాగంగా 11,158 గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

వాటిలో ఈ ఫిబ్రవరి 20వ తేదీ నాటికి 3300 కేంద్రాలు, మార్చి నాటికి 5300 కేంద్రాలు, ఏప్రిల్‌ నాటికి 7300 కేంద్రాలు ఆపరేషన్‌లోకి వస్తాయని.. అలా రాబోయే ఖరీఫ్‌ నాటికి మొత్తంగా 11,158 కేంద్రాలు ఆపరేషన్‌లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రైతు భరోసా కేంద్రాలు కీలకంగా నిలుస్తాయన్న సీఎం, రాబోయే రోజుల్లో రైతులకు కావాల్సిన ప్రతి అవసరం అదే గ్రామంలోనే, అక్కడే పరిష్కారమయ్యే విధంగా ఈ కేంద్రాలు పని చేస్తాయని చెప్పారు. 
 
ఎవరెవరు ఉంటారు?
ఈ రైతు భరోసా కేంద్రాలలో.. గ్రామ సచివాలయాల్లో ఇప్పటికే నియమితులైన వ్యవసాయ, హార్టికల్చర్, సెరీ కల్చర్‌కు సంబంధించిన అసిస్టెంట్లు కూర్చుంటారని, వారితో పాటు, వెటర్నరీ అసిస్టెంట్లు, వెటర్నరీ డాక్టర్లు కూడా అక్కడే కూర్చుంటారని, ఇంకా రెవెన్యూ పర్సన్‌ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి అవసరం ఉన్నప్పుడు వచ్చి పోతా ఉంటాడని తెలిపారు. గ్రామస్థాయిలో బ్యాంక్‌కు సంబంధించిన వ్యక్తి కూడా అందుబాటులో ఉండే విధంగా చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు.
 
ఏ పని చేస్తాయి? 
ఈ రైతు భరోసా కేంద్రాలలో రైతులకు సంబంధించిన ప్రతి సమస్య అక్కడే పరిష్కారమవుతుందని, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా పక్కనే లైవ్‌ వర్క్‌షాప్‌ కూడా ఉంటుందని సీఎం తెలిపారు. వ్యవసాయంలో బెస్ట్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసులు ఏమిటన్నవి చూపి, వాటిని నేర్పించే కార్యక్రమం కూడా చేస్తారని, అంతే కాకుండా ఇంటరాక్టివ్‌ సూచనలు, సలహాలు కూడా ఇస్తారని చెప్పారు.

రైతులకు ఏమైనా సందేహాలు కలిగినే వెంటనే ఈ భరోసా కేంద్రాలకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, అందుకోసం అక్కడ ఒక గ్రూప్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ను కూర్చోబెడుతున్నామని.. ఇంకా ఒక డైరెక్ట్‌ కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తూ వాటిని రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేస్తామని వివరించారు.

డైరెక్ట్‌గా వీడియో స్క్రీనింగ్‌ వసతి కూడా కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి, ఆ విధంగా నిపుణులతో కూడా సూచనలు, సలహాలు ఇప్పించడం జరుగుతుందని చెప్పారు.  రైతులకు బెస్ట్‌ ప్రాక్టీసెస్‌లో సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా, నేచురల్‌ ఫార్మింగ్‌కు సంబంధించిన అవగాహన కూడా కల్పిస్తారని, ఆ విధంగా రైతులకు సంబంధించిన ప్రతి అంశంలో తోడుగా ఉంటారని తెలిపారు. 
 
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు
రైతు భరోసా కేంద్రాలలో క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కూడా క్వాలిటీ స్టాంప్‌ వేసి అమ్ముతారని సీఎం ప్రకటించారు. రైతు అనేవాడు ఎక్కడా కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదన్న ఆయన, నాణ్యత లేని విత్తనాలు కానీ, ఫర్టిలైజర్స్‌ కానీ, పెస్టిసైడ్స్‌ కానీ కొనుగోలు చేసి రైతులు నష్టపోయే పరిస్థితి పూర్తిగా మారుస్తూ, రైతు భరోసా కేంద్రాలలో ప్రభుత్వ స్టాంప్‌ వేసి, క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌ అమ్ముతారని వివరించారు.
 
ఫిష్, ఆక్వా సాగులోనూ..
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఫిష్, ఆక్వా సాగు చేసే ప్రాంతాలలో.. వాటికి సంబంధించిన క్వాలిటీతో కూడిన ఫీడ్, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పై అవగాహన కల్పించడం కూడా జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
 
హెల్త్‌ కార్డులు
పశువులకు కూడా మొట్టమొదటిసారిగా హెల్త్‌ కార్డులు ఇవ్వబోతున్నామని సీఎం వెల్లడించారు. క్రాప్‌ ఇన్సూరెన్స్, క్యాటిల్‌ ఇన్సూరెన్స్‌తో పాటు, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఈ కేంద్రాలలో రైతులకు అవగాహన కల్పించడం కూడా జరుగుతుందని చెప్పారు. 
 
భూసార పరీక్షలు
గ్రామంలో రైతులకు మేలు చేసేందుకు భూసార పరీక్ష (సాయిల్‌ టెస్ట్‌) కూడా చేస్తారని, ఇంకా విత్తనాల నాణ్యతను పరీక్షించే (సీడ్‌ టెస్టింగ్‌) సౌకర్యాలు కూడా అక్కడే ఉంటాయని తెలిపారు. ఏ రైతు అయినా కూడా ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన విత్తనాలే కాకుండా, వేరే ఏ చోటి నుంచైనా విత్తనాలు తీసుకుంటే, వాటి నాణ్యత తెలుసుకునేందుకు ఈ సీడ్‌ టెస్టింగ్‌ సదుపాయం ఉపయోగపడుతుందని చెప్పారు. 
 
ధాన్యం రైతులకు కూడా మేలు చేయడం కోసం తేమ శాతం (మాయిశ్చర్‌ టెస్టింగ్‌) తెలుసుకునే మీటర్లు కూడా రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
 
గిట్టుబాటు ధరలు
‘రాబోయే రోజుల్లో రైతులు తాము అమ్ముకునే పంటలకు సంబంధించి.. రైతు పంట వేసేటప్పుడే ఫలానా పంటకు కనీస గిట్టుబాటు ధర ఇదీ. ఇంతకన్నా తక్కువ ధరకు ఏ రైతు అయినా కూడా తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా తక్కువ రేటుకు ఎవరైనా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది అంటే, ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అన్ని రకాలుగా వాటిని సేకరిస్తుంది.. అని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చాము.. అంటూ సీఎం ఆ ప్రకటన కాపీని చూపారు’.

‘ఇంకా ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎంత? ఆ పంట ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఎప్పుడు సేకరిస్తాము అన్నది కూడా ఆ ప్రకటనలో రాశాము’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
 
పంటల కొనుగోలు
‘ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. రైతు ఆ గ్రామంలోనే పంట వేస్తాడు. కానీ తాను ఆ పంట అమ్ముకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? దళారుల దగ్గరకు పోయి తక్కువ ధరకు తెగనమ్ముకునే పరిస్థితి రాకూండా చూసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలు జోక్యం చేసుకుంటాయి. ఆ రైతుకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకుంటాయి’.

‘ఇదీ ఈ పంట కనీస గిట్టుబాటు ధర. అంత కంటే తక్కువ ధరకు ఎవరూ అమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా ఎక్కువ ధర వస్తే మీరు బంగారం మాదిరిగా అమ్ముకోండి. కానీ ఇంత కన్నా తక్కువ ధర వస్తే మాత్రం ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయి’ అని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 
 
ఇంకా ఏమేం చేస్తాయి?
కేవలం ధాన్యం కొనుగోలు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో విత్తనాల పంపిణీని కూడా రైతు భరోసా కేంద్రాలు చేపడతాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులకు సంబంధించి ప్రతి పనినీ ఈ కేంద్రాలు చేస్తాయన్న ఆయన, ఇప్పటికే ప్రభుత్వ పథకాలు అనేకం ఉన్నాయంటూ రైతులకు తోడుగా ఉండేందుకు ‘ఈ క్రాప్‌’ ఉందని ప్రస్తావించారు. 
 
‘ఈ క్రాప్‌’ పై అవగాహన కల్పించడం, అది జరిగే విధంగా చూడడం.. గ్రామంలో ఏ పంట వేస్తే బాగుంటుందన్న సలహాలు ఇవ్వడం.. మండలం, జిల్లా, చివరకు ఊరును ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ఈ ఊళ్లో మీరు ఈ పంట వేస్తే మీకు ఇంకా మంచి రేట్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట పరిస్థితి ఇది. ఈ పంట కొరత ఉంది.

ఈ పంట ఇప్పటికే ఎక్కువ సాగు చేశారు కాబట్టి, మీరు అమ్ముకోలేక నష్టపోతారు. కాబట్టి ఈ పంట వేయండి అని చెప్పి.. ఆ స్థాయిలో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యతను రైతు భరోసా కేంద్రం చేపడుతుంది’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
వెనకడుగు వేయలేదు
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా వారికి తోడుగా, అండగా ఉంటున్నామని.. ఆర్థిక పరిస్థితులు అన్యాయంగా ఉన్నా, చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం పోతూ పోతూ విపరీతమైన బకాయిలు పెట్టినా కూడా.. ఏ రోజూ కూడా మాకు ఇన్ని సమస్యలున్నాయి.

ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఇచ్చిన మాట నుంచి వెనకడుగు వేస్తున్నామని దేవుడి దయతో చెప్పలేదని అన్నారు. దేవుడు సహకరించాడని, ప్రజలు దీవించారని చెప్పారు.
 
ఒక ఏడాది ముందుగానే
‘రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పింది ఏమిటంటే, ఈ సంవత్సరం అనుకోలేదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే సరికి జూన్‌ వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం ఇవ్వాలని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు.

నాలుగేళ్ల పాటు, ఏటా రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని మాత్రమే ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. కానీ రైతులకు మంచి చేయాలన్న ఆరాటం, తపన, తాపత్రయంతో ఈ సంవత్సరమే అక్టోబరులోనే ఇచ్చాము. ఖరీఫ్‌ సీజన్‌లో కాకుండా రబీలోనే వెంటనే అమలు చేశాం’.

‘ఇంకా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని అంతకు ముందు చెప్పినా, ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా దాదాపు 46 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు రూ.13,500 చొప్పున ఇచ్చామని ఈ వేదిక నుంచి గర్వంగా చెబుతున్నాము’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
ఉచిత బీమా. వడ్డీ లేని రుణాలు
అదే విధంగా రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నామని, నిజానికి ఇంతకు ముందు రైతులు బీమా ప్రీమియమ్‌ చెల్లించాలి వచ్చేదని.. కానీ తాము అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేసి, మిగతా మొత్తం ప్రీమియమ్‌ ప్రభుత్వమే కడుతోందని వెల్లడించారు.

ఆ విధంగా రైతులకు భరోసా ఇస్తూ, ఒక్క బీమా ప్రీమియమే రూ.2100 కోట్లు రైతుల తరపున ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. ‘ఇంకా మేము అధికారంలోకి రాగానే ఈ ఏడాది జూన్‌లో రైతులకు మరో గొప్ప పథకం అమలు చేశాం. అదే రైతులకు వడ్డీ లేని రుణాలు. అంతకు ముందు రైతులకు ఆ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు.

కానీ ఇవాళ ‘వైయస్సార్‌ వడ్డీ లేని రుణాలు’ అని చెప్పి ప్రవేశపెట్టామని గర్వంగా చెబుతున్నాము. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో పంట రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని కూడా గర్వంగా చెబుతున్నాము’ అని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 
ధరల స్థిరీకరణ నిధి
ఇంకా రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని, ఆ విధంగా ప్రతి రైతుకు తోడుగా ఉంటామని చెప్పారు. ఏ రైతు కూడా తమ పంటలను తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా చేస్తామని మరోసారి భరోసా ఇస్తున్నామని అన్నారు.
 
పగలే 9 గంటల విద్యుత్‌
‘ప్రతి రైతుకు పగటి పూటే 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలన్న తపన, తాపత్రయంలో అడుగులు ముందుకు వేశాము. ఆ దిశలో సమీక్షించినప్పుడు.. అధికారులు చెప్పిన మాట.. రాష్టంలో 6663 వ్యవసాయ ఫీడర్లు ఉంటే, వాటిలో దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలు విద్యుత్‌ ఇచ్చే సామర్థ్యం లేదని, అందువల్ల రూ.1700 కోట్లు ఖర్చు చేస్తే, ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచవచ్చని అధికారులు చెప్పారు.

దీంతో వెంటనే ఆ రూ.1700 కోట్లు విడుదల చేశాం. ఆ విధంగా కనీసం ఈ ఖరీఫ్‌కు అయినా వ్యవసాయ ఫీడర్లు పూర్తి స్థాయిలో పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేసే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించాము’.

‘అందులో భాగంగా వచ్చే జూలై నాటికి అవి పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అధికారులు కూడా చెప్పారు. ఇప్పటికే 60 శాతం ఫీడర్ల నుంచి పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా అవుతుండగా, వచ్చే జూలై నుంచి 100 శాతం ఫీడర్లు పని చేస్తాయి’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
వ్యవసాయ మిషన్‌
ఇంకా రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి కూడా ఏర్పాటు చేశామని, రైతులకు మరింతగా మేలు చేసేందుకు వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేయగా, దానికి తానే చైర్మన్‌గా ఉన్నానని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. ఇంకా ఆ మిషన్‌లో రైతులు, స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్‌ కూడా ఉన్నారని చెప్పారు.

ప్రతి నెలా ఒకసారి కలిసి, వారందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి? వాటిని మెరుగుపర్చడం కోసం ఏం చేయాలి? అన్నవి ఆలోచిస్తామని. ఆ తర్వాత వాటన్నింటినీ అమలు చేస్తూ ఒక మిషన్‌మోడ్‌లో పోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నామని అన్నారు.
 
ఈ విధంగా ప్రతి అడుగు రైతుల మేలు కోసం వేస్తున్నామని చెబుతూ, ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా భవిష్యత్తులో వారికి మరింత మేలు చేసే అవకాశం రావాలని కూడా ఆశిస్తున్నానంటూ సీఎం వైయస్‌ జగన్‌ సభలో తన ప్రసంగం ముగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు