తిరుపతి ఆలయానికి ఒంటరిగా వచ్చిన ఓ మహిళకు మత్తుమందు ఇచ్చి ఆమె నగలు, డబ్బు దోచుకున్న ఘటన కలకలం రేపింది. ఈ దోపీడీకి పాల్పడిన తమిళనాడుకు చెందిన ఒక ముఠాను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తు వుంటారు.
ఈ నేపథ్యంలో తిరుమల కొండపై ఒంటరిగా ఉన్న తమిళనాడుకు చెందిన మహిళకు మత్తుమందు ఇచ్చి ఆమె వద్ద వున్న నగదు, బంగారం దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 5వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒంటరిగా వున్న మహిళతో మాటలు కలిపి.. ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు ఓ వ్యక్తి. ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె నగలు, డబ్బును దొంగిలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాను కూడా వారు పరిశీలించారు. తిరువణ్ణామలై జిల్లా చెయ్యార్ తాలూకా కన్నికాపురం గ్రామానికి చెందిన విజయకుమార్, అతని కోడలు శారతపై ఈ దోపిడీకి జరిగనట్లు వెల్లడైంది.
పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద జరిపిన దర్యాప్తులో వారు ఒంటరిగా వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారితో మాటలు కలిపి.. మత్తుమందు సాయంతో వారి బంగారు ఆభరణాలు, డబ్బు సెల్ ఫోన్‌లను దొంగిలించేవారని తేలింది. విజయకుమార్ ఇప్పటికే తమిళనాడులో చాలా చోట్ల ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు.
నిందితుల నుంచి 21 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 45,000 విలువైన నగదు, 3 మొబైల్ ఫోన్లు, 6 మత్తుమందు మాత్రలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఆపై వారిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.