నిజామాబాద్‌లో దారుణం : సినిమాకంటూ తీసుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్

శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. సినిమాకంటూ తీసుకెళ్లిన ఓ యువతిపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆ యువతి ప్రియుడుతో పాటు.. అతని స్నేహితులు మరోఆరుగురు ఉన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అనే అటవీ ప్రాంతం ఉంది. ఈ గ్రామానికి చెందిన యువకుడికి పక్క గ్రామానికి చెందిన యువతితో కొన్ని నెలలుగా పరిచయం ఉంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో ఆ యువతీ యువకుడు సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో సినిమాకు వెళ్దామని చెప్పి శుక్రవారం యువతిని తన బైక్‌పై ఎక్కించుకున్న యువకుడు సినిమాకు కాకుండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితులకు సమాచారం అందించడంతో ఆటోలో అక్కడికి చేరుకున్న ఆరుగురు యువకులు కూడా ఆ యువతిపై అత్యాచారం చేశారు. 
 
వారి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కేకలు వేయడంతో నిందితులంతా తలోవైపు పారిపోయారు. అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలిని రక్షించిన పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు