చిరుతపులి ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని ఓ చిరుతపులి నోటకరుచుకుని లాక్కెళ్లింది. గ్రామస్థులు, తల్లిదండ్రులు వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించి ఆ చిన్నారిని కాపాడుకున్నారు. ఈ దాడిలో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి తల, పొట్ట భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే పాపను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.
పెద్దదోర్నాల మండలం, శ్రీశైలానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల చెంచుగూడేనికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతులు తమ మూడేళ్ల కుమార్తె అంజమ్మతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన చిరుత, వారి పక్కనే నిద్రిస్తున్న చిన్నారి అంజమ్మ తలను నోట కరుచుకుని నెమ్మదిగా బయటకు ఈడ్చుకెళ్లింది. దీంతో షాకైన ఆ పాప తల్లిదండ్రులు, స్థానికులు చిరుతతో పోరాడారు.
జనాలను చూసి భయపడిన చిరుత, కొంత దూరంలో పాపను పొదల్లో వదిలేసి అడవిలోకి పారిపోయింది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన గూడెం వాసులు, తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్లే వన్యప్రాణుల దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గురువారం దోర్నాల-శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.