కరోనావైరస్ ప్రభావం ప్రారంభమయ్యాక దేశవ్యాప్తంగా రవాణా నిలిచిపోవడంతో ఏపీ-తెలంగాణ మధ్య కూడా ప్రైవేటు బస్సులు ఆగిపోయాయి. కేంద్రం అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించినా, అంతర్రాష్ట్ర రవాణాపై నిషేదం ఎత్తివేసినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులు నడపలేక పోయాయి.
ఏపీ- తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు కార్లు, ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే అదునుగా తీసుకొని వీరు అధిక చార్జీలను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైదరాబాదుకు ప్రైవేటు బస్సులను అనుమతించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆపరేటర్లు రాకపోకలు ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ నుంచి హైదరాబాదుకు 150 సర్వీసులు నడుపుతున్నట్లు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు చెబుతున్నారు.