నూతన సంవత్సరంలో సాధారణ ప్రజలతో గవర్నర్

మంగళవారం, 31 డిశెంబరు 2019 (08:32 IST)
నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపునిస్తూ, ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సాధారణ ప్రజలు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియచేయవచ్చని గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు.

విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో జనవరి 1వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12.30 గంటల వరకు గవర్నర్  రాష్ట్ర  ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించారు. అయితే కార్యక్రమానికి హాజర‌య్యే వారిని భద్రతా పరిమితులకు లోబడి రాజ్ భవన్‌లోకి అనుమతించటం జరుగుతుందని, సందర్శకులు తమతో ఎటువంటి పుష్ప గుఛ్చాలను తీసుకురారాదని పేర్కొన్నారు.

ప్రధమ పౌరుడికి శుభాకాంక్షలు తెలియచేసేందుకు కేవలం మొక్కలను మాత్రమే రాజ్ భవన్‌కు అనుమతించటం జరుగుతుందని మీనా వివరించారు. పాఠశాల విద్యార్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం నూతన సంవత్సర శుభవేళ రాజ్ భవన్ స్వాగతం పలుకుతుందన్నారు.

మరోవైపు నూతన సంవత్సర శుభవేళ గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2020 సంవత్సరంలో ప్రతి పౌరుడికీ మంచి జరగాలని ఆకాంక్షించిన బిశ్వభూషణ్, అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాధుని వేడుకుంటున్నట్లు వివరించారు. 
 
రాజ్ భవన్ క్యాలెండర్ ఆవిష్కరించిన గవర్నర్...
నూతన సంవత్సర ఆగమనం నేపధ్యంలో 2020 సంవత్సరానికి గాను ప్రత్యేకంగా రూపొందించిన రాజ్ భవన్ క్యాలెండర్‌ను గ‌వర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆవిష్కరించారు. గవర్నర్ ఛాంబర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారుల సమక్షంలో గవర్నర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఏడు పేజీలతో రూపొందించిన ఈ కాల్యెండర్ లో ప్రధమ పౌరునిగా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకార తొలి పేజీగా ముద్రించారు. కవర్ పేజీగా రాజ్ భవన్ భవనాన్ని తీసుకురాగా,  రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులతో భేటీ చిత్రాలను, గవర్నర్ పర్యటనలకు సంబంధించిన చిత్రాలను ఈ క్యాలెండర్ లో పొందుపరిచారు.

ప్రభుత్వ సాధారణ సెలవు దినాలు, ఐఛ్చిక సెలవులను నిర్ధేశించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు