ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష?: గుడివాడ అమర్‌నాథ్‌

సోమవారం, 30 ఆగస్టు 2021 (09:14 IST)
14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ ఒక్క మంచి పని చేయలేదని,  ఎన్నికలప్పుడు మాత్రమే టీడీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకు వస్తారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్, నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని తెలిపారు.  వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు, విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ మోహన్ రెడ్డి చేస్తే.. అది చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో టీడీపీ వేదిక ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని అమర్ దుయ్యబట్టారు. 
 
విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్ మాట్లాడుతూ.. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు అలసత్వం వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఈ దుస్థితి ఏర్పడిందని, విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200 రోజుకు చేరుకుందని, కార్మికులంతా రోడ్లమీదకు వచ్చి నిరసన తెలుపుతుంటే టీడీపీ నేతలు ఎక్కడ దాక్కున్నారని సూటిగా ప్రశ్నించారు.

ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందో చర్చకు తాము సిద్ధమని... అందుకు టీడీపీ నేతలు సిద్ధమా అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ సవాల్‌ విసిరారు.
 
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- రాష్ట్రంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మూడు రాజధానులు ప్రకటించారు. కోవిడ్ కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రభుత్వం అమలు చేస్తోంది.

గత రెండున్నరేళ్లుగా దాదాపు లక్షా 10వేల కోట్ల రూపాయిలు లబ్దిదారులకు నేరుగా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసి ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజలను ఆదుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్‌లో నిర్మాణం చేసుకున్న విలాసవంతమైన భవనంలో సేద తీరుతూ... రాష్ట్రానికి తాను ప్రతిపక్ష నేతను అనే విషయం గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ప్రజల ముందుకు తీసుకు వస్తున్నారు. 
 
2- రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌గారి నాయకత్వాన్ని అంగీకరించి 151మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపు 90శాతం వైయస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించారు.  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి గానీ, టీడీపీకిగానీ ఈ రాష్ట్రంలో ఉనికి లేదని ప్రజలు అభిప్రాయపడుతూ 2019 ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గట్టిగా బుద్ధి చెప్పారు.

చంద్రబాబుకి ప్రజలు పదే పదే బుద్ధి చెప్పినా...  ఆయన కుట్ర ఆలోచనలు మారటం లేదు. ఏ సమస్య గుర్తుకురానప్పుడు, ఏ రాజకీయ అంశం రాష్ట్రంలో లేనప్పుడు, అప్పుడు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు.
 
3- టీడీపీ నాయకత్వాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నాయకుల్ని, వెనక ఉండి నడిపిస్తున్నటువంటి  అపార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో టీడీపీ స్థాపించిన తర్వాత, ఆ పార్టీ దాదాపు 17-20 ఏళ్లపాటు అధికారంలో ఉండి, ఆ పార్టీ  ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పి, మా ప్రభుత్వం మీద, జగన్‌ మోహన్‌ రెడ్డిగారి గురించి మాట్లాడితే మంచిది.

- ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు దాదాపు 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ హయాంలో మీరు చేసిన అభివృద్ధి, మేలు చేసిన కార్యక్రమాల గురించి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు వివరించి... ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇంతకాలం ఓట్లు, సీట్ల కోసం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వాడుకున్నారే తప్ప, రాష్ట్ర విభజన తర్వాత ...13జిల్లాలో అత్యంత  ప్రాధాన్యత ఉన్న విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన రాలేదు. దేశంలోనే అత్యున్నత నగరం అయిన విశాఖను అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయని చంద్రబాబు నాయుడికి, టీడీపీకి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేదు.
 
4-ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా ఉన్న విశాఖపట్నాన్ని.. హైదరాబాద్‌తో పోటీ పడగలిగే నగరంగా ఉన్న విశాఖను విభజన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించి ఉంటే.. ఈరోజు ఏ స్థాయిలో విశాఖ నగరం అభివృద్ధి చెంది ఉండేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఆరోజు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడానికి గల కారణం... విశాఖను ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏంటో చంద్రబాబుగారు చెప్పాలి. 
 
- అన్ని వనరులు కలిగిన నగరం విశాఖపట్నం. అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రముఖమైన నగరాలను కలిపే నేషల్‌ హైవే, రైల్వే కనెక్టివిటీ, రెండు పోర్టులు, కావాల్సినన్ని మౌలిక వసతులు ఉన్న విశాఖను వదిలేసి అమరావతిని ఎందుకు రాజధానిగా ప్రకటించారో చంద్రబాబు చెప్పాలి.

రాష్ట్ర విభజనకు కారణమే చంద్రబాబే.  ఉత్తరాంధ్రకు అన్యాయం చేసింది మీరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి పేరు చెప్పి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి, వేలాది కోట్లు సంపాదించాలని తపన పడింది మీరు.  దానికి ఉత్తరాంధ్రను అన్యాయం చేసిన మీకు, మీ పార్టీ నేతలకు ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాం.
 
5- వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మూడు రాజధానులు ప్రకటించి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయించి.. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాతే,  ఈ ప్రాంతానికి భవిష్యత్‌ ఉంటుందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు మేలు జరుగుతుందని గొప్ప నిర్ణయం తీసుకుంటే దాన్నిస్వాగతించలేని టీడీపీ, పైగా కోర్టులో పిటిషన్‌ లు వేస్తూ అడ్డుపడుతుంది. 

- చంద్రబాబు తాలుకా ఆలోచనలు, సిద్ధాంతాలు కాపాడాలని .. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి, ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లతో అనేక పర్యాయాలు శాసనసభ్యులుగా, మంత్రులుగా రాష్ట్రంలో పరిపాలన చేసిన టీడీపీ నేతలకు నిజంగా సిగ్గులేదా అని అడుగుతున్నాను. ముందు విశాఖను పరిపాలన రాజధానిగా అంగీకరించి, స్వాగతిద్దామని చంద్రబాబుతో ప్రకటన చేయించిన తర్వాతే టీడీపీ చర్చలు పెడితే బాగుంటుంది. 
 
6 -విశాఖ ఎల్జీ పాలమర్స్ లో ప్రమాదం జరిగితే ప్రతిపక్ష నేత చంద్రబాబు రారు. కరోనా విలయతాండవం చేస్తున్నా.. ప్రజలను పలకరించలేదు. అదే రూ.150 కోట్ల కుంభకోణంలో భాగస్వామ్యులై, కార్మికుల సొమ్మును పందికొక్కుల్లా అరెస్ట్‌ అయినవారిని పరామర్శించడానికి మాత్రం చంద్రబాబుకి,ఆయన కొడుకు లోకేష్‌కు  సమయం దొరుకుతుంది. రూ.150 కోట్లు కార్మికుల తాలుకా సొమ్మును మంత్రి హోదాలో దిగమింగిన వ్యక్తి అధ్యక్షతన ఉత్తరాంధ్రపై చర్చా వేదికలు నిర్వహించటమా..?
 
7- విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి 200వ రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్మికులు, ప్రజలు పది కిలోమీటర్ల మేర రోడ్లమీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితికి కారణం 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, కేంద్రమంత్రిగా ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన అశోక్‌ గజపతిరాజే. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఈ టీడీపీ నాయకులు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారో సమాధానం చెప్పాలి. 
 
8-తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉత్తరాంధ్రపై ఉన్న కక్ష ఏంటో చెప్పాలి. ఉత్తరాంధ్రలో గానీ, విశాఖలో గానీ అభివృద్ధి చేయాలంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డంగులు, ఆటంకాలు సృష్టిస్తున్నారు. స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ కోసం నిర్మాణం చేపడుతుంటే, అక్కడ ఏ నిర్మాణాలు కట్టడానికి వీల్లేదంటూ పిటిషన్లు వేసి అడ్డుకున్నారు. 

- రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్‌ను అయినా తీసుకువచ్చారా..  - కేవలం నోవాటెల్‌ హోటెల్ లో సమావేశానికి మాత్రమే విశాఖను అడ్డుపెట్టుకున్నారు. 25 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని టీడీపీ పాలించింది. ఉత్తరాంధ్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ కట్టారా?
 
9 -గడిచిన రెండున్నరేళ్లలోనే అనకాపల్లి, పాడేరులో మెడికల్‌ కాలేజీ నిర్మాణపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు విజయనగరానికి మెడికల్‌ కాలేజీని మంజూరు చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ విశాఖకు దేశవ్యాప్తంగా గుర్తింపు తేవాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

- అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. హెల్త్‌ సిటీ, విమ్స్‌, ఐటీ టవర్స్‌, బీఆర్‌టీస్‌ రోడ్లు ఇవన్నీ వైయస్సార్‌ హయాంలో చేసినవే. సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు 8లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఆయన తనయుడు జగన్‌గారు రూ.2500 కోట్ల ప్యాకేజీతో అనకాపల్లి నుంచి ఫేజ్‌ వన్‌, ఫేజ్‌ టూ ద్వారా నిర్మాణాలకు కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
- అదే 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి. చంద్రబాబుకు ఆయన కొడుకుకు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుపడటం ఎలానో నేర్పేందుకు క్లాస్‌లు పెట్టాలి. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయం ఇక్కడ ప్రాంత ప్రజలకు తెలియదా? టీడీపీ నాయకులు ఏ మొహం పెట్టుకుని చర్చా కార్యక్రమం పెడతారు. 20 ఏళ్లు అధికారం ఇచ్చిన ఈ ప్రాంతానికి  ఏమీ చేయలేదని చెబుతారా? ఇప్పటి ప్రభుత్వం కూడా ఏమీ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నామని చెబుతారా?
 
10-కేవలం రాజకీయ అవసరాల కోసం ఓట్లు, సీట్లు కోసం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని చెబుతున్నాం. టీడీపీ నాయకులకు గానీ, చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నాం. మీరు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన అభివృద్ధికి.. వైయస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన అయిదున్నర ఏళ్లు, జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన రెండేళ్లల్లో.. అంటే ఈ ఏడున్నర సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? ప్రాంతం ఏదైనా సరే... ఎక్కడైనా సరే ఉత్తరాంధ్రపై చర్చకు మేము సిద్ధం. 

- పక్క రాష్ట్రంలో ఉండి ఓట్లు, సీట్లు కోసం పాకులాడుతున్న చంద్రబాబు నాయుడు కోసం ... దయచేసి ఉత్తరాంధ్ర ‍ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు