ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగినని నమ్మించి పెళ్లి.. ఆపై పరాయి పురుషులతో పడుకోవాలని ఒత్తిడి!

సోమవారం, 23 నవంబరు 2020 (08:57 IST)
ఓ యువకుడు... తాను ఎయిర్‌ఫోర్సులో పని చేస్తున్నట్టు నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత అడ్డుదారులు తొక్కసాగాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకోసం తన కట్టుకున్న భార్యనే పావుగా ఉపయోగించాడు. భార్యతో పడక గదిలో సన్నిహితంగా ఉన్నపుడు రహస్యంగా వీడియోలు తీశాడు. ఆ తర్వాత వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ డబ్బు సంపాదన మొదలుపెట్టాడు. అప్పటికీ ఆశ చావక... దురాశ ఎక్కువైంది. భార్యను వేధించసాగాడు. పరాయి పురుషులతో పడుకోవాల్సిందిగా ఒత్తిడి చేయసాగాడు. ఈ వేధింపులు తారాస్థాయికి చేరడంతో ఇక భరించలేనని భావించిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఓ యువతిపై మనసుపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు తాను ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగం చేస్తున్నట్టుగా నమ్మించాడు. ఆ తర్వాత పెళ్లి సమయంలో భారీగా కట్నకానులకు తీసుకున్నాడు. 
 
భర్త ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కావడంతో విమానాశ్రయానికి తీసుకెళ్లాలని, విమానాలు చూపించాలని భార్య తరచూ అడిగేది. దీంతో అసలు విషయం బయటపడింది.తనకు ఎలాంటి ఉద్యోగం లేదని తేల్చిచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపాయి. పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఇద్దరూ కలిసి ఉంటున్నారు.
 
ఆ తర్వాత ఓ కొరియర్ సంస్థ పెట్టి నష్టపోయిన నిందితుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు. పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని, తన మాట వినకుంటే తలను గోడకు బాదుకుని చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితురాలు దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 
 
పరాయి వ్యక్తుల వద్దకు వెళ్లి డబ్బులు సంపాదించాలని ఒత్తిడి తెస్తున్నాడని చెప్పింది. దీంతో ఆమె భర్తను పిలిపించిన పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా మరిన్ని దారుణాలు వెలుగుచూశాయి. భార్య నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలియకుండా నగ్న ఫొటోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవాడినని, వాటికి ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
 
అలాగే, భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియోలను యూట్యూబ్, యాప్‌లలో లైవ్‌‌లో చూపించి డబ్బులు సంపాదించేవాడు. ఆ వీడియోలు చూసి తనను సంప్రదించిన వారి వద్దకు వెళ్లాలంటూ భార్యను బలవంతం చేసేవాడు. అతడు పెట్టే మానసిక హింసను భరించలేని ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ నిపుణుల సాయంతో యూట్యూబ్‌లో అతడు అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు