అవి రాజ‌కీయ క‌క్ష‌లు కాదు... పొలం త‌గాదాలు: గుంటూరు రూరల్ ఎస్పీ

బుధవారం, 24 నవంబరు 2021 (18:38 IST)
పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన సంఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. అది పొలం త‌గాదాకు సంబంధించినద‌ని, రాజ‌కీయ క‌క్ష‌లు కాద‌ని తెలిపారు.


కొన్ని సామాజిక మాధ్యమాలలో తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన వీడియోలను చూశామ‌ని, ఆ ఘటన శివారెడ్డి, సైదాభి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న పొలం తగాదాలు కారణంగా చోటు చేసుకుంద‌ని ఎస్పీ తెలిపారు. ఈ ఘటన ఆదివారం జరిగిందని, సదరు సమాచారం అందిన వెంటనే పిడుగురాళ్ల పోలీస్ ఎఫ్. ఐ.ఆర్. 651/2021 కింద బాధితులు తెలిపిన సమాచారం మేరకు కేసు ద‌ర్యాప్తు చేపట్టార‌ని చెప్పారు.
 
 
గతంలో సైదాభి ఈ పొలం వివాదంలోనే శివారెడ్డిపై దాడి చేయగా, శివారెడ్డి ఫిర్యాదు మేరకు అక్టోబ‌రు 20న ఎఫ్.ఐ.ఆర్. 602/2021 కింద పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశార‌ని చెప్పారు. పొలం వివాదంలో ఉన్న పాత కక్షలను దృష్ట్యా ఈ ఘటన జరిగినది తప్ప, దీనిలో ఎటువంటి రాజకీయ కోణం లేదని అన్నారు. ఏదేమైనప్పటికి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌న్నారు. ఈ కేసుల్లో స‌త్వ‌రం స్పందించిన జిల్లా పోలీసుల‌కు   ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు