నంద్యాలలో క్లౌడ్ బరస్ట్ : గ్రామాన్ని ముంచెత్తిన వరద

ఠాగూర్

గురువారం, 18 సెప్టెంబరు 2025 (13:57 IST)
ఏపీలోని నంద్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు జరుగుతున్నాయి. దీంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. జిల్లాలోని ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామంలో క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో ఆ గ్రామంలో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా ఈ గ్రామాన్ని వరద ముంచెత్తింది. గ్రామం మొత్తం ఏరును తలపిస్తుంది. ఇళ్ల మధ్య వరద ఏరులై ప్రవహించడం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు పిడుగుల గండం.. భారీ వర్ష సూచన 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిడుగుల గండం ఏర్పడివుంది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ సమయంలో పిడుగులతో కూడిన వర్షం కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, రాయలసీ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ కుండపోత వర్షం కురుస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలకు అవకాశం ఉందని పేర్కొంది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
 
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం, గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. అలాగే కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ కూడా రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడా కుండపోత వానలు కురవవచ్చని అంచనా వేసింది.
 
ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అదేవిధంగా, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ కారణాల వల్లే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలులో 6.4 సెం.మీ., విజయనగరం జిల్లా రాజాంలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
 
ఇదిలావుండగా, బంగాళాఖాతంలోనూ వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది అల్పపీడనంగా మారుతుందా లేదా అనే దానిపై త్వరలో స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. అనంతరం ఈ నెల 26 లేదా 27న మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడుతుందని, ఇది మరింత బలపడే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు