గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు.. మహిళ మృతి... ఇంటి పైకప్పు ఎక్కి..

మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (16:48 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ మహిళ మృతిచెందింది. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలం, కరళపాడు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాచేపల్లి వద్ద నాగులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గురజాల వద్ద రైల్వే ట్రాక్‌పైకి వర్షపు నీరు చేరింది. దీంతో మాచర్ల-గుంటూరు మధ్య రాకపోకలను రైల్వే అధికారులు నిలిపివేశారు. 
 
పల్నాడు, గురజాల, కారంపూడి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ పూర్తిగా, జలమయమైంది. పలువురు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
కాగా బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చీరాల, అద్దంకిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి