అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు గృహాల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులతోపాటు గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా ప్రాంతంలో మూడేళ్లకు తక్కువ కాకుండా పనిచేసి ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి వుండి ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో తెలుగు పత్రికల తరపున పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఈ పథకంలో ఇళ్లు మంజూరు చేసేందుకు యీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు రెండు పథకాలు, పట్టణ ప్రాంత జర్నలిస్టులకు టిడ్కో ద్వారా అమలు జరుగుతున్న నాలుగు పథకాల పరిధిలో ఇళ్లు నిర్మించుకొనేందుకు అవకాశం కల్పించాలని సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొనేందుకు ఇళ్ల స్థలాలు లేని జర్నలిస్టులకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తుల నుండి భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు మంజూరుచేసి ఇళ్లు నిర్మించుకొనే అవకాశం కల్పించాలని యీ సమావేశంలో నిర్ణయించారు.
సచివాలయంలోని సమాచార మంత్రి కాలవ శ్రీనివాసులు ఛాంబరులో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులుగా వున్న మునిసిపల్ మంత్రి డా.పి.నారాయణ, మీడియా సలహాదారు డా.పరకాల ప్రభాకర్, సమాచార శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, గ్రామీణ గృహనిర్మాణ చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున్, టిడ్కో చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
ప్రభుత్వం జారీచేసిన అక్రిడేషన్ కలిగి వుండి సొంత ఇంటి స్థలం కలిగిన జర్నలిస్టులను మొదటి కేటగిరీగా గుర్తించి వారికి ఇళ్లను మంజూరు చేస్తారు. వారు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల సమాచారశాఖ అధికారుల ద్వారా అందజేసేందుకు తక్షణమే అవకాశం కల్పిస్తారు. ఇళ్ల స్థలాలు లేక ప్రభుత్వం మంజూరుచేసే ఇళ్ల స్థలంలో తాము సొంతంగా ఇళ్లు నిర్మించుకొనే వారిని రెండో కేటగిరీగా భావిస్తారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ద్వారా ఇళ్లనిర్మాణం కోరుకొనే వారికి నాలుగు రకాల పథకాల్లో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకొనే అవకాశం కల్పిస్తారు.
గ్రామీణ ప్రాంతంలో రెండు రకాల పథకాల ద్వారా ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం, లబ్దిదారులు స్వయంగా నిర్మించుకొనే పథకాల కింద ఇళ్లు నిర్మించుకొనే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ పథకాలపై జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో గురువారం మధ్యాహ్నం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో సమాచార మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు.