కదులుతున్న రైలులో ఎక్కుట గానీ దిగుట గానీ ప్రమాదము అని ప్రతి రైల్వే స్టేషనులోనూ నెత్తినోరు కొట్టుకుంటూ రైల్వే సిబ్బంది చెప్పినప్పటికీ కొందరు దాన్ని పెడచెవిన పెడుతుంటారు. దీనితో అక్కడక్కడా జరిగే ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పేతుంటే మరికొందరు అంగవైకల్యం చెందుతున్నారు. కదులుతున్న రైళ్లలో ఎక్కుట లేదా దిగుట రెండూ ప్రమాదమే. రైలు కదిలిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు ఎక్కరాదు. అలాగే రైలు కదులుతూ వున్న సమయంలో దిగటమూ తప్పే అవుతుంది.
విశాఖ సిటీ రైల్వే స్టేషనులో ఇలాంటి ఘటన జరిగింది. రైలు బండి స్టేషను నుంచి కదిలి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి మహిళ చేయి పట్టుకుని పరుగుపెడుతూ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఐతే రైలు వేగం అందుకోవడంతో సదరు మహిళ కిందపడిపోయింది. ఇంకాస్త వుంటే ఆమె రైల్వే ఫ్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయేది. ఐతే అక్కడే వున్న రైల్వే పోలీసు వెంటనే స్పందించి ఆమెను కాపాడారు.