కూలీ డబ్బులు రూ.300 కోసం తమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నకు జీవితకారాగారశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హైదారాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో జరిగిన ఈ కేసులో తీర్పు తాజాగా వెలువడింది. హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన కర్రె రాములు (35), కర్రె పోచయ్య (32) అన్నదమ్ములు. 2016 మార్చి 19న ఓ టెంట్‌హౌస్‌లో కూలీకి ఇద్దరు వెళ్ళారు. పనులు పూర్తయ్యాక వచ్చిన డబ్బులో పోచయ్యకు రాములు రూ.300 తక్కువ ఇచ్చాడు. దీంతో పోశయ్య నిలదీశాడు. ఆగ్రహానికి గురైన రాములు అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పోచయ్యను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పోచయ్య ఆస్పత్రి నుంచి పారిపోయి, అదే నెల 22వ తేదీన ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై 2016 మే 13న పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, కేసు విచారించిన పోలీసులు... రాములుకు జీవితఖైదుతో పాటు రూ.1000 అపరాధం విధిస్తూ నాంపల్లిలోని 14వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. రాములును చంచల్‌గూడ జైలుకు పంజాగుట్ట పోలీసులు తరలించారు.