పింఛను కోసం కుటుంబ పెద్దను ఉమ్మెత్తకాయ పొడితో చంపేశారు...

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (18:10 IST)
పింఛను డబ్బుకు ఆశపడి తల్లి, కుమారుడు, కుమార్తె కలిసి ఇంటిపెద్దను చంపేశారు. ఇందుకోసం ఉమ్మెత్తకాయపొడిని వాడుకున్నారు. ఈ నెల 15వ తేదీన మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కిషన్ మారుతి సుతార్ అనే 70 యేళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈయన రిటైర్డ్ ఉద్యోగి. ఈయన్ను కన్నకుమారుడే హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆరు బక్కెట్లలో ఇంట్లోనే నిల్వవుంచి పారిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. 
 
అయితే, ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి హతుని భార్య, కుమార్తె, కుమారుడులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. సదరు రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి పింఛను కోసం తల్లి, చెల్లితో కలిసి కన్న తండ్రినే కుమారుడు హతమార్చినట్టు తేల్చారు. 
 
మహారాష్ట్ర, హింగోలి గ్రామానికి చెందిన కిషన్‌మారుతీ సుతార్‌(70) రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి. రైల్వేలో గూడ్స్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాడు. కిషన్‌మారుతీ సుతార్‌కు భార్య గంగాబాయితోపాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం కాగా, మూడవ కుమారుడు పదేండ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 
 
రైల్వే గూడ్స్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న కిషన్‌మారుతీ సుతార్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో 2000లో వాలంటరీ రిటైర్డ్‌మెంట్‌ తీసుకున్నాడు. రిటైర్డ్‌మెంట్‌ అనంతరం మల్కాజిగిరి, మౌలాలి, ఆర్టీసీ కాలనీ, కృష్ణానగర్‌కాలనీలో ఇంటిని కొనుగోలు చేసి భార్య గంగాబాయి(58), కుమారుడు కిషన్‌సుతార్‌ అలియాస్‌ కిషన్‌ అలియాస్‌ రాహుల్‌(40), కూతురు ప్రపుల్ల అలియాస్‌ పప్పి (29)తో కలిసి ఉంటున్నాడు
 
అయితే, కుమారుడు కిషన్‌ సుతార్‌ వ్యసనాలకు బానిసగా మారాడు. ఎలాంటి ఉద్యోగం చేయకుండా తండ్రికి వచ్చే పింఛన్‌పై ఆధారపడ్డాడు. వృద్ధుడైన కిషన్‌మారుతి సుతార్‌కు వచ్చే పింఛన్‌ రూ.30వేల పైనే కుటుంబ సభ్యులు ఆధారపడ్డారు. డబ్బుల కోసం కుమారుడు కిషన్‌సుతార్‌, కూతురు ప్రపుల్ల, భార్య గంగాబాయి తరుచూ కిషన్‌మారుతి సుతార్‌తో గొడవ పడేవారు. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఎలాగైనా కిషన్‌మారుతీ సుతార్‌ను హత్యచేసి పింఛన్‌ డబ్బులను పొందాలని పథకం వేసుకున్నారు.
 
అయితే, కిషన్‌మారుతీ సుతార్‌ను చంపేందుకు సులభమైన మార్గం కోసం కుమారుడు కిషన్‌సుతార్‌, భార్య గంగాబాయి, కుమార్తె ప్రపుల్ల సోషల్‌మీడియాలో సెర్చ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఓ క్లూ లభించింది. 'ఉమ్మెత్తకాయ పౌడర్' ద్వారా మత్తు కలుగుతుందని కనుగొన్నారు. ఈనెల 4న ఉమ్మెత్తకాయలను తీసుకొచ్చి దానిని పౌడర్‌గా తయారు చేసి రోజు కొద్దిగా భోజనంలో కలిపి కిషన్‌మారుతి సుతార్‌కు ఇచ్చారు. పౌడర్‌ను కలిపిన భోజనం తిని తండ్రి మత్తులోకి జారుకోవడం గమనించారు. దీంతో ముగ్గురు కలిసి ఈనెల 15న రాత్రి భోజనం సమయంలో ఉమ్మెత్తకాయ పౌడర్‌ను ఎక్కువగా కలిపి ఇచ్చారు.
 
దీంతో సుతార్‌కు మత్తు ఎక్కువై మృతి చెందాడు. వృద్ధుడు మృతి చెందిన విషయాన్ని గమనించిన భార్య, కుమారుడు, కూతురు ముగ్గురు కలిసి మృతదేహాన్ని పూజ రూమ్‌లోకి తీసుకెళ్లారు. మృతదేహాన్ని రెండు కత్తులతో ముక్కలు ముక్కలుగా చేసి ఆరు డస్ట్‌బిన్‌లలో నింపారు. ఆ మృతదేహాన్ని ఇంటి నుంచి తరలించేందుకు కుమారుడు కిషన్‌సుతార్‌ ఆటో కోసం బయటకు వెళ్లాడు. ఇంతలోనే ఆ ప్రాంతంలో దుర్వాసన వ్యాపించడంతో ఇంటి పక్క వారు ఇంట్లోకి వచ్చి చూడగా 6 బిన్లల్లో నింపిన కిషన్‌మారుతి సుతార్‌ మృతదేహం ముక్కలు కనిపించాయి. 
 
విషయం స్థానికులకు తెలువడంతో కుమారుడు, కుమార్తె, భార్య అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో మల్కాజిగిరి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు కలిసి సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వృద్ధుడిని హత్య చేసినట్లు అంగీకరించారు. తండ్రి పింఛన్‌ డబ్బుల కోసమే కుమారుడు తన తల్లి, చెల్లితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన కుమారుడు కిషన్‌ సుతార్‌, భార్య గంగాబాయి, కుమార్తె ప్రపుల్లను పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ ముగ్గురూ టీబీ వ్యాధిగ్రస్తులు కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు