గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క... ప్రాణం తీసింది.. ఎలా?

బుధవారం, 22 మార్చి 2017 (10:51 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఓ విషాదం జరిగింది. చికెన్ ముక్క ఒకటి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అదెలాగంటారా? అయితే, ఈ కథనం చదవండి. హైదరాబాద్, చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌లో నిర్మల, కుమారస్వామి (48) అనే దంపతులు నివశిస్తున్నారు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో కుమార స్వామి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈనెల 16న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. 
 
చికెన్ కూరతో చపాతీ తింటుండగా ఒక్కసారిగా చికెన్ ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే నీళ్లు తాగిన ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చికెన్ ముక్కను వెలికి తీసేందుకు నిర్మల నానా విధాలుగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించక పోవడంతో 108 ఆంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
కుమార స్వామిని పరిశీలించిన వైద్యులు... అత్యవసరంగా ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను తొలగించారు. గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను వైద్యులు బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించడంతో కుమారస్వామి మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి