వివాహేతర బంధానికి అడ్డొస్తుందనీ గర్భిణీని చంపి.. స్టోన్ కట్టర్‌తో ముక్కలు చేశారు...
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (21:15 IST)
హైదరాబాద్ నగరంలో కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద లభ్యమైన వివాహిత(గర్భిణి) మృతదేహం కేసులోని మిస్టరీని నగర పోలీసులు పూర్తిగా ఛేదించి, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. భర్త వివాహేతర సంబంధానికి అడ్డురావడాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులంతా కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
బీహార్ రాష్ట్రంలోని చందౌసీ ప్రాంతానికి చెందిన పింకీ అలియాస్ బింగీకి గతంలో దినేశ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా భర్తకు దూరంగా పింకీ నివశిస్తోంది. ఈ క్రమంలో వికాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతన్ని పెళ్లి చేసుకుంది. పెద్ద కొడుకు జతిన్(8)ను మాత్రం తన వద్దే పింకీ ఉంచుకుంది. ఆ తర్వాత వీరి మకాం మహనమాలితీ గ్రామానికి మార్చారు.
అదే గ్రామానికి చెందిన అనిల్ ఝా(75), మమత ఝా(37), వారి కుమారుడు అమర్ కాంత్ ఝా(22)తో వికాస్‌కు పరిచయం పెరిగింది. కొన్నాళ్లకు మమత, వికాస్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అనిల్, అమర్ కాంత్‌కు వీరి వ్యవహారం తెలిసినా ఏమీ అనలేదు. ఈ వ్యవహారం గ్రామమంతా తెలియడంతో వికాస్, అమర్‌కాంత్ కలిసి 10 నెలల కిందట హైదరాబాద్‌కు వచ్చి గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌లో అద్దెకు దిగారు.
ఆ తర్వాత పింకీకి చెప్పకుండా మమత, అనిల్ ఝా కూడా వచ్చేశారు. అమర్‌కాంత్ గచ్చిబౌలిలోని ఓ బార్‌లో పనికి కుదరగా మమత, వికాస్ కలిసి పానీపూరీ బండి ప్రారంభించారు. పింకీ గత డిసెంబర్‌లో వికాస్ అడ్రస్ కనుక్కొని కుమారుడు జతిన్‌తో కలిసి సిద్దిఖీనగర్‌కు చేరుకుంది. ఈమె భర్త వికాస్, మమత ఝా కుటుంబంతో కలిసి ఉంటూ వచ్చింది.
అయితే, తమ గుట్టు బయటపడుతుందన్న ఉద్దేశ్యంతో పింకీని బయటకు పంపేవారు కాదు. ఈ క్రమంలో పింకీ మరోమారు గర్భందాల్చింది. అదేసమయంలో తమ గ్రామంలో తాకట్టు పెట్టిన పొలాన్ని తిరిగి చేజిక్కించుకోవాలంటే వికాస్‌ను చేజారిపోకుండా కాపాడుకోవాలని, పింకీ అడ్డుతొలిగించుకోవాలని మమతతో పాటు.. ఆమె భర్త, కుమారుడు భావించారు.
అదేసమయంలో పింకీ ప్రసవానికి పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందనీ, అంత సొమ్ము భరించలేమంటూ వికాస్‌కు మమత నూరిపోసి, పింకీ అడ్డుతొలగించుకోవాలని మమత ప్లాన్ వేసి, ఈ విషయాన్ని వికాస్, భర్త అనిల్, కొడుకు అమర్‌కాంత్‌కు చెప్పి వారిని ఒప్పించింది కూడా.
తమ ప్లాన్‌లో భాగంగా, గత నెల 27వ తేదీన పింకీతో మమత ఉద్దేశ్యపూర్వకంగా గొడపడింది. ఈ క్రమంలో మమత.. పింకీ గొంతును పట్టుకొని గొడకేసి బాదడంతో అక్కడే కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయిన పింకీని వికాస్, అమర్‌కాంత్, అనిల్ కలిసి కొట్టి చంపేశారు. ఒకరోజంతా శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని మరుసటిరోజు ఉదయం పింకీ కొడుకు జతిన్‌ను మమత బయటికి తీసుకెళ్లగా వికాస్, అమర్‌కాంత్ కలిసి పింకీ మృతదేహాన్ని బాత్‌రూంలోకి తీసుకెళ్లి స్టోన్ కట్టర్‌తో ముక్కలు చేసి సంచుల్లో కుక్కారు. ఆ తర్వాత అమర్‌కాంత్ తాను పనిచేసే బార్‌లోని తోటి ఉద్యోగి బైక్‌ను తీసుకొచ్చాడు. 29న తెల్లవారుజామున 3 గంటలకు అమర్‌కాంత్, మమత మూటలు తీసుకొచ్చి శ్రీరామ్‌నగర్ కాలనీ వద్ద పడేసినట్టు పోలీసులు వివరించారు.