గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి హైదరాబాద్ కొండపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద పడేసిన కేసు మిస్టరీ వీడింది. సైబరాబాద్ పోలీసులు 13 రోజుల ముమ్మర దర్యాప్తు తర్వాత నిందితులను గుర్తించారు. మృతురాలి పేరు పింకీ కశ్యప్ అని, ఆమెను భర్తతో కలిసి కుటుంబ సభ్యులే హత్య చేసినట్టు నిర్ధారించారు.
బీహార్‌కు చెందిన పికీ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ అనే వ్యక్తిని కొన్నేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. ప్రస్తుతం సిద్ధిఖీనగర్‌లో బీహార్‌కు చెందిన అమర్‌కాంత్ ఝా, తండ్రి అనిల్ ఝా, తల్లి మమత ఝా కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వారి ఇంట్లో ఏడేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. పింకీ కశ్యప్‌ను అమర్‌కాంత్ ఝా హత్య చేశాడని, ఇంట్లోనే తల్లిదండ్రులు, ఆమె భర్త వికాస్, బాలుడి ముందే క్రూరంగా చంపేశాడని తేలింది.
హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. గోనె సంచుల్లో కుక్కి అమర్‌కాంత్, అతడి తల్లి మమతతో కలిసి బైక్‌పై తీసుకెళ్లి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసినట్టు తేలింది. అయితే, పింకీని ఎందుకు హత్య చేశారో తేలాల్సి ఉన్నది. అలాగే, తన కళ్ల ఎందుటే భార్యను హత్య చేస్తుంటే భర్త వికాస్ ఎందుకు మిన్నకుండిపోయాడో తెలియడం లేదు.
కాగా, పరారీలో ఉన్న భర్త వికాస్, మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమర్‌కాంత్ ఝాను మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈయనను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెడుతామని అధికారులు తెలిపారు.