రాష్ట్ర వ్యాప్తంగా 'పరిశుభ్రత పక్షోత్సవాలు': పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

శనివారం, 25 జులై 2020 (09:34 IST)
రాష్ట్ర వ్యాప్తంగా 1320 గ్రామపంచాయతీల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన 'మనం-మన పరిశుభ్రత' పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్‌ చట్టం 1994, సెక్షన్ 45 ప్రకారం గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్యంను పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీలపై వుందని తెలిపారు.

పంచాయతీల్లో ప్రజాభాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన గ్రామ వాతావరణం సాధ్యమవుతుందని అన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి పదిహేను రోజుల పాటు పరిశుభ్రత పక్షోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నడుం కట్టిందని తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ రెండు గ్రామపంచాయతీలను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశామని తెలిపారు.

ఎంపిక చేసిన ఈ పంచాయతీల్లో పరిశుభ్రత పక్షోత్సవాలను పంచాయతీ స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు కలిసి ప్రారంభించారని వెల్లడించారు. ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఏరకంగా పరిశుభ్రతను పాటించాలి, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ పక్షోత్సవాల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
 
గ్రామ సమస్యల తక్షణ పరిష్కారంకు మొబైల్ టాస్క్‌ఫోర్స్‌
పరిశుభ్రత పక్షోత్సవాల్లో భాగంగా ఆయా పంచాయతీల్లోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ అంశాలపై తక్షణం పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇందుకోసం ప్రతి పైలట్ గ్రామపంచాయతీలోనూ ఒక మొబైల్ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఎంపిక చేసిన రెండు పంచాయతీల్లో ఒక పంచాయతీలో ఎంపిడిఓ ఆధ్వర్యంలో ఆర్‌డబ్యుఎస్‌ ఎఇ, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, బోర్ మెకానిక్, గ్రీన్ అంబాసిడర్ లు వుంటారని తెలిపారు.

రెండో పంచాయతీలో పంచాయతీరాజ్ విస్తరణాధికారి ఆధ్వర్యంలో పంచాయతీఆర్ ఎఇ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, బోర్ మెకానిక్, గ్రీన్ అంబాసిడర్‌లు సభ్యులుగా వుంటారని వెల్లడించారు.

కేవలం ప్రజల్లో చైతన్యం కల్పించడమే కాకుండా, అక్కడిక్కడే వారు చెప్పిన తాగునీటి, పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన మెటీరియల్, పరికరాలను కూడా తమవెంట తీసుకువెడతారని తెలిపారు. 
 
ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు
పరిశుభ్రతా పక్షోత్సవాల సందర్బంగా ప్రతిరోజూ టాస్క్‌ఫోర్స్‌ బృందం నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను కూడా ప్రభుత్వం నిర్దేశించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ పక్షోత్సవాల ప్రారంభం రోజున శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి అయిదు గంటల వరకు రెండు పైలెట్ గ్రామ పంచాయతీల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ప్రజలతో సమావేశాలు నిర్వహించాయని తెలిపారు.

మొత్తం 1320 పంచాయతీల్లో ఈ సమావేశాలు జరిగాయని వెల్లడించారు. అలాగే 25వ తేదీన ప్రతి పంచాయతీలోనూ ప్రజలు, ఎన్జీఓలు, స్వయం సహాయక సంఘాల నుంచి ప్రతి 500-600 గృహాలకు 10 మంది సభ్యులతో కూడిన గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలిపారు.

27వ తేదీన పంచాయతీల్లో సమస్యలను గుర్తించేందుకు ప్రజాభాగస్వామ్యంతో ట్రాన్సాక్ట్ వాక్ నిర్వహిస్తారని, ఈ సందర్బంగా ఆయా పంచాయతీల్లో అపరిశుభ్రంగా వున్న ప్రదేశాలను, మురుగునీరు నిల్వ వున్న ప్రదేశాలను, గుర్తించడం, దోమలు వ్యాప్తి చెందే ప్రదేశాలు, తాగునీటి సరఫరా పైప్ లీకేజీ, పూడికతో నిండిన డ్రైన్లు తదితర అంశాలను గుర్తిస్తారని అన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్లకు అవసరమైన మరమ్మతులు, కమ్యూనిటీ మేనేజ్‌డ్ శానిటరీ కాంప్లెక్స్ తదితర అంశాలను రికార్డు చేస్తారని తెలిపారు. 28వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ప్రతి గ్రామంలోనూ యాబై గృహాలను ఈ బృందాలు పరిశీలించి, వారి సమస్యలను రికార్డు చేయడంతో పాటు వాటిని పరిష్కరించే చర్యలు చేపడతారని వివరించారు.

ఆగస్టు 15వ తేదీన గ్రామ ఇన్‌చార్జి అధికారి ఆధ్వర్యంలో స్థానిక మంత్రివర్యులను, ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించి పంచాయతీలో జాతీయ పతాకావిష్కరణ చేయిస్తారని, అలాగే మొబైల్ టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో గ్రామస్తాయి సమావేశం నిర్వహించి పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

పరిశుభ్రత పక్షోత్సవాలలో జరిగిన అన్ని కార్యక్రమాలు గ్రామాల్లో నిరంతరం స్థిరమైన పద్దతిలో కొనసాగించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళికను తయారు చేస్తారని వెల్లడించారు. 
 
వ్యాధులకు అవగాహనతో చెక్‌ పెట్టాలి
ఒకవైపు ప్రజలు కరోనా వైరస్‌తోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, వర్షాలు ప్రారంభం కాగానే ప్రబలే సీజనల్ వ్యాధులను కూడా ప్రజలు ఎదుర్కోవాల్సి వుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అవగాహనతోనే ప్రజలు ఈ వ్యాధులకు చెక్‌ పెట్టగలరని అన్నారు.

పరిశుభ్రత, పారిశుధ్యంపై దృష్టిసారించడం, పరిశుభ్రమైన తాగునీటిని వినియోగించడం, వ్యాధులకు కారణమయ్యే దోమల వ్యాప్తి జరగకుండా డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యర్థాల వల్ల అంటువ్యాధులు ప్రబల కుండా అప్రమత్తంగా వుండటం వల్ల గ్రామసీమలు ఆరోగ్యంగా వుంటాయని అన్నారు.

ఈ అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహనను, చైతన్యంను కల్పించేందుకు కరపత్రాల ద్వారా ఇంటింటికి ప్రచారం చేస్తామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు