ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ, మన్యం జిల్లాల్లో పర్యటించి, అడవితల్లి బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొందరు అభిమానులు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. వెంటనే కల్పించుకున్న పవన్ కళ్యాణ్.. నేను సీఎం చంద్రబాబు నాయుడు కాదమ్మా.. నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడ నిస్తుందన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీనిని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి లేక గిరిజన పుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రహదారి సౌకర్యం కల్పించి వారి జీవనశైలిని మారుస్తామన్నారు.
అలా అనుకుంటే అరకుతో మన్యం ప్రాంతంలో రోడ్లు వేసేవారం కాదని చెప్పారు. ఎందుకంటే గత ఎన్నికల్లో అరకు ప్రాంత ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయలేదన్నారు. అయినప్పటికీ తమకు కోపం లేదన్నారు. రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.