నా స్థానంలో ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు : ఓ.పన్నీర్ సెల్వం

ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (12:06 IST)
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తాను ఎదుర్కొన్న కష్టాలు అన్నీఇన్నీకావనీ ఆ సమయంలో తన స్థానంలో ఎవరున్నా ఆత్మహత్య చేసుకునివుండేవారనీ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం అన్నారు. 
 
ఆయన తేని జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, 'అమ్మ' మరణం తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో సమస్యలొచ్చాయి. లెక్కలేనన్ని అవమానాలు జరిగాయి. నా స్థానంలో ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు. నన్ను చివరకు టీ దుకాణంలో కూర్చోబెడతానని టీటీవీ దినకరన్ పలుమార్పు హెచ్చరించాడు. ఇలాంటి ఎన్నో అవమానాలను దిగమింగుకుని ఉన్నాను. దీనికంతటికీ కారణం అమ్మపై ఉన్న విశ్వాసంతోనే తాను ఇవన్నీ భరించినట్లు ఆయన తెలిపారు.  
 
అంతేకాకుండా, అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామివర్గానికి తన వర్గానికి సయోధ్య కుదర్చడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. అన్నాడీఎంకే పార్టీని కాపాడుకోవడానికి కలసి పనిచేయాలని ప్రధాని సూచించారని చెప్పారు. పార్టీకి తన సేవలందిస్తానని, అయితే మంత్రి పదవి చేపట్టే ఆలోచన లేదని మోడీతో చెప్పగా 'లేదు.. లేదు మీరు తప్పని సరిగా మంత్రిగా కొనసాగి రాజకీయాల్లో రాణించాల'ని ప్రధాని చెప్పారనీ ఆకారణంగానే తాను మంత్రి పదవికి చేపట్టినట్టు తెలిపారు. దీంతో భాజపా ప్రమేయంతోనే పళని, పన్నీర్‌ వర్గాలు కలిసిపోయాయన్న వాదనకు బలం చేకూరినట్లయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు