పవన్ కళ్యాణ్ అడిగితే ఇంకా ఇచ్చేస్తాం... ఏపీ మంత్రి

శనివారం, 17 ఫిబ్రవరి 2018 (21:43 IST)
రాష్ట్రానికి న్యాయం చేయడానికి పవన్ కల్యాణ్ సహా ఎవరు పోరాటం చేసినా స్వాగతిస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏ మేర నిధులు కేటాయించింది అనే వివరాలు ఎవరడిగినా ఇవ్వడానికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఇంతవరకూ ఎవ్వరూ కూడా లిఖితపూర్వకంగా కేంద్ర నిధులపై సమాచారం అడగలేదన్నారు. 
 
పవన్ కల్యాణ్‌కు ఇప్పటికే కొంత సమాచారమిచ్చామన్నారు. అవసరమనుకుంటే మరింత సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయమన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం కోసం ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించారన్నారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ, రాష్ట్రాభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు.
 
కేసుల నుంచి బయటపడటానికి జగన్ యత్నం...
2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్... తనతో కలిసి టీడీపీ పనిచేయాలని పిలుపునివ్వడంపై జనాలు నవ్వుకుంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి మచ్చ లేకుండా పాలన సాగిస్తోందన్నారు. అటువంటి పార్టీ... జైలుకెళ్లిన జగన్‌తో పనిచేయడం కలలో కూడా జరగని పని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ కుమ్మకై జైలు నుంచి బయటపడ్డారన్నారు. ఇప్పుడు కేసుల నుంచి బయటపడడానికే జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీలు దీక్షతో పోరాటం చేస్తుంటే, ప్రతిపక్ష ఎంపీలు మాత్రం రాష్ట్రానికి నష్టం కలగాలని కోరుకుంటున్నారని మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు