ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచూ ఐ.ఎ.ఎస్. లు, ఐ.పి.ఎస్. లను బదిలీ చేస్తోంది. దాదాపుగా వారం విడిచి వారం బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఎందుకిలా తరచూ బదిలీలు చేస్తున్నారనే మీమాంశ అధికార వర్గాల్లో మొదలైంది.
తాజాగా, ఏపిలో ఐ.ఎ.ఎస్‌ల బదిలీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కార్యదర్శి గా ఉన్న ముకేశ్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‌గా రవిశంకర్ నారాయణ్ బదిలీ అయ్యారు. పీయూష్ కుమార్ జీఏడీకి బదిలీ అయ్యారు. సీసీఎస్‌ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహంకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ముఖ్యంగా గవర్నర్ వద్ద కార్యదర్శిగా ఉన్న ముకేశ్ కుమార్ మీనాను బదిలీ చేయడం చర్చనీయాంశం అయింది. ఆయన్నిపరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా పంపడం వెనుక రాజకీయ కారణాలున్నాయని భావిస్తున్నారు. గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియాను నియమించారు.