జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌... గ్రామీణ యువ‌కులు కూడా...

సోమవారం, 4 అక్టోబరు 2021 (16:01 IST)
క్రీడా రంగంలో ప్రస్తుతం యువత ఎక్కువగా క్రికెట్‌పై మక్కువ చూపుతోంది. ఆటలంటే అందరికీ అభిమానమే అయినా...క్రికెట్‌ అంటే చిన్న పిల్లవాడు మొదలు.. పెద్దల వరకు మోజు లేని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఈ ఏడాది ఏప్రిల్ 9న   ప్రారంభమైన ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌ మ్యాచ్ లపై యువత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. 
 
మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలోని  రెండు పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో సైతం  యువకులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక  మరి కొందరు ఇంట్లోనే టీవీల ముందు కూర్చుని ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెడుతున్నారు. రోజు ఒక్కోమ్యాచ్‌పై రూ.లక్షల్లో బెట్టింగ్ లు సాగుతోన్నట్లు సమాచారం. 
 
యువత ఇష్టాన్ని.. బెట్టింగ్‌ సంస్కృతిని ఆసరా చేసుకుంటున్న కొందరు క్రికెట్‌తో వ్యాపారం చేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ బుకీలుగా మారుతున్నారు. రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు స్నేహితులు బృందాలుగా ఏర్పడి బెట్టింగులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో మందు పార్టీలు సైతం చేసుకుంటూ తాగిన మైకంలో బెట్టింగ్‌లపై మోజు పెంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్కోబాల్‌కు బెట్టింగ్‌ పెట్టి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పైగా కొందరు అప్పుల పాలు  అవుతున్నారు. ప్రధానంగా గూగుల్‌పే, పేటీఎం ద్వారా సులభంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉన్నందున సెల్‌ఫోన్ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుకుంటున్నారు. గతంలో  ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. ఇక  మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆడేది ఎవరైనా సరే తమకు నచ్చిన ఆటగాళ్లపై గెలుపు ఓటములపై తమకున్న ఆలోచన విధానంతో బెట్టింగులు పెడుతున్నారు. ఇదిరోజు సాగుతూనే ఉంది. నగరపాలకసంస్థ పరిధిలో ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగులు రోజుకూ రూ.లక్షల్లో సాగుతున్నట్లు సమాచారం. యువత రానురాను విష వలయంలో చిక్కుకుంటోంది. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ పై యువత మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీస్‌ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్నటివరకు పోలీస్‌ అధికారులందరూ కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం అంతగా లేకపోవడంతో పోలీస్‌ అధికారులకు కొంత విరామం దొరికినట్లు అయ్యింది.

ఇదే సమయంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు  జోరుగానే సాగుతున్నాయన్న సమాచారం ఉంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల ద్వారా యువత పెడదారి పడుతోంది. గతంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌లు జరిపిన వారే మళ్లీ ఈసారి రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. మంగళగిరి, తాడేపల్లి  పట్టణాల్లో  పలువురు  పేరు మోసిన వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా అవసరాల నిమిత్తం డబ్బులు అప్పుగా తీసుకుని మరీ కొందరు యువత  క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్ప డుతున్నారు. అవి అయిపోయాక స్నేహితుల వద్ద, బెట్టింగులో ఉన్న కొందరి పెద్ద మనుషుల వద్ద అధిక వడ్డీకి తీసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు