చెన్నై సూపర్ కింగ్స్‌ జైత్రయాత్ర.. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపు

గురువారం, 30 సెప్టెంబరు 2021 (23:27 IST)
Dhoni
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ రెండో అంచెలో చెన్నై సూపర్ కింగ్స్‌ అదరగొడుతోంది. షార్జా వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో ఛేదించింది. 
 
ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (45), డుప్లెసిస్‌ (40) ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి మ్యాచ్‌లో రెండు మూడు ఓవర్ల ముందుగానే ముగుస్తుందనిపించింది. 
 
అయితే జట్టు స్కోరు 100 పరుగులు దాటిన తర్వాత స్వల్ప తేడాతో మొయిన్ అలీ, సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌ వరుసగా అవుట్‌ అయ్యారు. దీంతో చెన్నై పరుగుల వేగం మందగించింది. ఈ క్రమంలో చెన్నై లక్ష్యం రెండు ఓవర్లలో 16 పరుగులుగా మారింది. 
 
అయితే 18 ఓవర్లలో రాయుడు ఓ సిక్స్‌, ధోనీ ఫోర్‌ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో మూడు పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులకు కేవలం ఒకే రన్‌ వచ్చింది. క్రీజులో రాయుడు, ధోనీ ఉన్నప్పటికీ కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
 
అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్‌ 3, బ్రావో 2, శార్ధూల్‌ ఠాకూర్‌, జడేజా తలో వికెట్ తీశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు