ఏపిలో బడుగు బలహీన వర్గాలపై వైసీపీ ప్రభుత్వం దమనకాండ సాగిస్తుందని, బీసీ నేత అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు రానున్న కాలంలో వైకాపా తగిన మూల్యం చెల్లిస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రష్టు పట్టించి అపహాస్యం చేస్తున్న ఈ అరాచక ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేరోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
ఈఎస్ఐ కేసులో అక్రమాలు జరిగాయని వైసీపీప్రభుత్వం అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీసే నిలువెత్తు ప్రజల ధైర్యం అచ్చెన్నాయుడు అని, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే ఆయన చేసిన తప్పా అని అన్నారు.
వైసీపీ పాలనలో అణచివేతకు గురైన బీసీ వర్గాల గొంతుకగా తన గళాన్ని వినిపిస్తున్న అచ్చెన్నాయుడుని సభలో ఎదుర్కునే సత్తాలేక ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
టిడిఎల్సీ ఉపనేత, ఎమ్మెల్యే మాజీ మంత్రిని అరెస్టు చేసేటప్పుడు కనీసం చట్టబద్ధంగా వ్యవహరించడం చేతగాని ఈ వైసీపీ ప్రభుత్వం మట్టిలో కలిసే రోజు త్వరలోనే ఉందన్నారు.
నిరాధార ఆరోపణలతో, విచారణ లేకుండా కక్ష కట్టి అచ్చెన్నను అరెస్టు చేయడం బీసీలను వేధించడమే అని, ఇటువంటి చర్యలతో టిడిపి నాయకులకు భయపెట్టలేరని వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసం, అన్యాయాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడుపై జగన్ కక్షగట్టి ఇలాంటి దుర్మార్గాలకు దిగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ ఘటనలకు సిఎం జగన్, హెూంమంత్రి , డిజిపి సమాధానం చెప్పాలని, ఈ దుర్మార్గాన్ని, ఉన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గద్దెను దిగ్భంధించిన పోలీసులు అచ్చెన్నాయుడును విజయవాడలోని ఎసీబీ కోర్టులో హాజరు పరచటానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుందని తెలిసి ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ గద్దె పార్టీ శ్రేణులతో కలిసి ఎసీబీ కార్యాలయం ముట్టడికి బయలదేరబోగా విషయం పసిగట్టిన పోలీసులు ఆయన్ను పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు.
విలేకరులు సమావేశం అనంతరం గద్దె రామమోహన్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు దిగ్బంధించారు.