శభాష్ పవన్ గారు.. రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా తితిదే : ఐవైఆర్

సోమవారం, 25 మే 2020 (13:44 IST)
తమిళనాడులోని శ్రీవారి భూముల లేదా ఆస్తులను విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు నిర్ణయం తీసుకోవడాన్ని అనేక మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా, ఈ అంశంపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ గళం వినిపిస్తున్నారు. అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం వినిపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థాన భూముల వేలంపై స్పందించిన పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఐవైఆర్ ఓ ట్వీట్ చేశారు. రాజకీయ నాయకులకు టీటీడీ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. 'ముఖ్యమైన సమస్యపై మీరు గళం విప్పినందుకు కృతజ్ఞతలు పవన్ కల్యాణ్ గారు. ప్రభుత్వం మంచి పద్ధతులు పాటించాల్సి ఉంటుంది... మంచి ఉదాహరణగా నిలవాలి. టీటీడీ రాజకీయ నాయకులకు, వ్యాపారులకు పునరావాస కేంద్రంగా మారిన నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇంతకంటే గొప్ప విషయాలను ఊహించలేం' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.
 
మరోవైపు, విపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తోసిపుచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చీకట్లో జీవోలు ఇచ్చే ఆలోచన తమకు లేదన్నారు. చంద్రబాబులా సదావర్తి భూములు దొంగచాటుగా వేలం వేయాలని నిర్ణయించలేదని ఎద్దేవా చేశారు.
 
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో ఏదో జరుగుతోందని టీడీపీ, వారి అనుకూల మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి ఉన్న సమయంలో టీటీడీలో ఉపయోగంలో లేని భూములను వేలం వేసేందుకు కమిటీ వేశారని, గతంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారని, బాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం వారి అనుకూల మీడియాకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు