‘అమూల్‌’తో జగన్‌ ప్రభుత్వం భాగస్వామ్యం

శనివారం, 27 జూన్ 2020 (07:59 IST)
రాష్ట్రంలో పాడిపరిశ్రమకు మహర్దశ రానుంది. పాడిపరిశ్రమల అభివృద్ధి చెందేలా, రైతులకు అదనపు ఆదాయాల రూపంలో మేలు చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మక సహకార కంపెనీ ‘అమూల్‌’తో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. 

తద్వారా ఆ కంపెనీ అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విస్తృతమైన మార్కెటింగ్‌ను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో సహకారార రంగాన్ని బలోపేతంచేయడంతోపాటు, రైతులకు మంచి ధర వచ్చేలా చూసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జులై 15 లోగా ఈమేరకు ‘అమూల్‌’తో అవగానా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి, పాడిరైతుల సమస్యలు, పాల ఉత్పత్తులకు మంచి ధర కల్పించే అవకాశాలపై కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్‌ శాఖమంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖమంత్రి గౌతంరెడ్డి  ఈ సమావేశానికి హాజరయ్యారు.

వ్యవసాయ మిషన్‌ వైస్‌ఛైర్మన్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య సహా ఇతర అధికారులుకూడా పాల్గొన్నారు. 
 
పాల ఉత్పత్తిదారుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చడం, రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి, కష్టానికి తగ్గ ప్రతిఫలం పాల ఉత్పత్తిదారులకు లభించేలా, నాణ్యమైన పాల ఉత్పత్తులు జరిగేలా, వాటిద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు తయారుచేసిన ప్రతిపాదనలను, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

అమూల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడిపరిశ్రమలపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలనూ సీఎంకు వివరించారు. పాల ఉత్పత్తుల రంగంలో దేశంలో అత్యుత్తమ సహకార సంస్థగా నిలిచిన అమూల్‌కు ఉన్న పేరు, సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన మార్కెటింగ్‌ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికీ, రైతులకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

‘అమూల్‌’తో భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చించి విధివిధానాలు ఖరారుచేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. తర్వాత ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్నారు. జులై 15లోగా అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు వెల్లడించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాడి రైతులు మేలు జరగాలని, వారు ఉత్పత్తిచేస్తున్న పాలకు మంచి రేటు రావాలని స్పష్టంచేశారు. ధర విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూదనన్నారు. రైతులకు అదనపు ఆదాయాలు ఇవ్వాలి, మరోవైపు సహకార రంగం బలోపేతం కావాలన్నారు.

పాడిపరిశ్రమలో అమూల్‌కున్న అనుభవం రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడాలని,  పాడిపశువులకు వైద్యం, సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, తద్వారా రైతులకు మంచి రేటు... ఇలా అన్ని అంశాల్లోనూ పాడిపరిశ్రమరంగం పటిష్టంకావాలన్నారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూదన్నారు. అమూల్‌తో కలిసి అడుగులు ముందుకేసేలా... తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
సహకార చక్కెర ఫ్యాక్టరీలపై సీఎం సమీక్ష:
సహకార చక్కెర కర్మాగారాల్లో పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రులు, అధికారులు కూర్చొని ప్రతిపాదనలు తయారుచేయాలను. ప్రణాళికపై ప్రతిపాదనలు తయారు అయ్యాక.. మరోసారి దీనిపై కూర్చొని ఖరారుచేద్దామని సీఎం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు