జగన్ గిరిజన పక్షపాతి: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

బుధవారం, 13 నవంబరు 2019 (05:15 IST)
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు గిరిజనుల హక్కులను కాలరాసి గిరిజనులకు తీరని అన్యాయం చేసారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి విమర్శించారు.

టీఏసీ ఏర్పాటులో మూడేళ్లు జాప్యం చేయడంతో పాటుగా గిరిజ ఎమ్మెల్యేల గొంతునొక్కాలని చూసారని ధ్వజమెత్తారు. అయితే ముఖ్యమంత్రి  వైయస్  జగన్మోహన్ రెడ్డి తాను గిరిజన పక్షపాతినని అడుగడుగునా నిరూపించుకుంటూనే ఉన్నారని ప్రశంసించారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో టీఏసి సమావేశం అనంతరం పుష్ప శ్రీవాణి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన సలహా మండలి(టీఏసి)ని మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు టీఏసిని వెంటనే ఏర్పాటు చేయకుండా మూడేళ్లు కాలయాపన చేసారని విమర్శించారు. గిరిజన శాసనసభ్యులతో టీఏసీ ఏర్పాటు చేయాల్సి ఉండగా అప్పట్లో కూడా గిరిజన ఎమ్మెల్యేలలో ఒక్కరు మినహా మిగిలినవారందరూ వైసీపీకి చెందిన వారు కావడంతో టీఏసీనే పక్కన పెట్టేసారని చెప్పారు.

వైసీపీ నేతలు ఎంతో వత్తిడి చేసిన తర్వాత 2017 సెప్టెంబర్ లో టీఏసి కమిటీని నియమించారని, అయితే ఆ కమిటీలో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా సభ్యులుగా నియమించి ప్రజల మద్దతుతో గెలిచిన గిరిజన శాసనసభ్యుల గొంతునొక్కే ప్రయత్నం చేసారని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలో నిర్వహించిన ఒక టీఏసి సమావేశంలో తీర్మానించిన అంశాలపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిన ఐదేళ్ల కాలంలో నాలుగున్నర సంవత్సరాలపాటు గిరిజన మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం గిరిజనులంటే చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి తార్కాణమని పుష్ప శ్రీవాణి దుయ్యబట్టారు.

అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడునెలలకే జగన్మోహన్ రెడ్డి టీఏసిని ఏర్పాటు చేసారని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో గిరిజనులందరూ ముక్తకంఠంతో కోరినా బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవో నెంబర్ 97ను రద్దు చేయలేదని, అయితే సిఎం జగన్ దాన్ని రద్దు చేసి తన మాట నిలబెట్టున్నారని ప్రశంసించారు.

గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ సబ్ ప్లాన్ కు చెందిన నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. అలాగే పాడేరులో గిరిజన మెడికల్ కాలేజీ, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం, ఐటీడీఏల్లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏడు సూపర్ స్పెషాలిటీ 
 
ఆస్పత్రులను మంజూరు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తాను గిరిజన పక్షపాతినని నిరూపించుకున్నారని కితాబిచ్చారు. వైయస్సార్ వివాహ కానుక పథకంలో గిరిజనులకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని రూ.లక్షకు పెంచారని, రాబోయే శ్రీరామ నవమి నుంచే ఈ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకొనే గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను రాబోయే ఉగాది కంటే ముందుగానే వచ్చే ఫిబ్రవరి మాసంలోనే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గిరిజన సలహామండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను గురించి క్లుప్తంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీ శాసనసభ్యులు భాగ్యలక్ష్మి (పాడేరు), బాలరాజు(పోలవరం),కళావతి (పాలకొండ), ధనలక్ష్మి (రంపచోడవరం), ఫల్గుణ (అరకు వ్యాలీ) తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు