లంచం అడిగారో సచ్చారే.. జగన్ స్వీట్ వార్నింగ్

గురువారం, 30 మే 2019 (14:06 IST)
రాష్ట్రంలో అవినీతి రహిత.. పారదర్శకమైన పాలన అందించే వీలుగా.. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించారు. 
 
అలాగే ప్రభుత్వ అధికారులకు కూడా జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల పనులు చేసేందుకు లంచాల అడిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే.. లంచాలపై ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుసంధానం చేస్తూ.. కాల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కాల్ సెంటర్‌కు లంచం బాధితులు ఎవ్వరైనా నేరుగా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని జగన్ తెలిపారు. 
 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సెక్రటేరియట్‌లో దాదాపు పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 నాటికి 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే వాలంటీర్లే పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ కావాలన్నా పనిచేస్తారని  చెప్పారు. 
 
కాబట్టి సెక్రటేరియట్‌లో అప్లికేషన్ పెడితే సులభంగా పనైపోతుందని జగన్ చెప్పారు. అలాగే దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లో పని అయిపోతుందని హామీ ఇస్తున్నానని జగన్ పేర్కొన్నారు. ఏది కావాలన్నా ఇప్పుడు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. కానీ లంచం, సిఫార్సులకు తావేలేకుండా అర్హులైన అందరికీ 72 గంటల్లో దరఖాస్తులు ఆమోదిస్తామని పునరుద్ఘాటించారు. 
 
గ్రామ వాలంటీర్లు సెక్రటేరియట్ తో అనుసంధానమై నేరుగా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేస్తారని హామీ ఇచ్చారు. నవరత్నాల్లో అన్నింటిని తూచాతప్పకుండా అమలు చేస్తామని జగన్ ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు