పోలీసులకు ఫిర్యాదు చేస్తే, న్యాయం కోసం నిత్యం స్టేషన్ చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలి. నిరుపేదలకు అయితే, సత్వర న్యాయం కనాకష్టం... కానీ, కొత్తగా వచ్చిన కృష్ణా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రూటే సెపరేటు. ఆయన అన్నాడంటే... చేస్తాడంతే!
రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించిన స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రతి రోజు స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కృష్ణా ఎస్పీ పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింప చేసేలా కృషి చేస్తున్నారు. ప్రతి రోజు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి సమస్యలు తెలుసుకోవడమే కాక, వారి సమస్యలను స్వీకరించిన వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి తక్షణమే న్యాయం అందిస్తున్నారు.
బందరు రూరల్ మండలం మేకవానిపాలెం కు చెందిన సుభాషిని అనే మహిళ ... తన భర్త మరణించి వారం రోజులు గడవకుండానే తన మామగారు, తనను, తన ముగ్గురు పిల్లలను ఇంటి నుంచి గెంటివేశాడు న్యాయం చేయమని ఎస్పీ గారిని ఆశ్రయించింది. ఆమె సమస్యలు విని చలించిపోయిన ఎస్పీ ఆ ఫిర్యాదును దిశ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి సత్వర న్యాయం అందించాలని డిఎస్పి రాజీవ్ కుమార్‌కి ఆదేశాలు జారీ చేశారు.
డిఎస్పీ వారి మామయ్యని, కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి, చట్ట పరిధిలో న్యాయబద్ధంగా మరణించిన తన కుమారుడికి చెందవలసిన ఆస్తి మొత్తాన్ని పూర్తి సమ్మతితో తన మనవడు, మనవరాల్ల పేరుపై బదిలీ చేయించారు. ఆ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించాడు.
ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే తమకు పూర్తి స్థాయిలో న్యాయం అందిందని, సుభాషిణి, వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి, ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేశారు.
సమస్యను పూర్తి సామరస్యంగా కుటుంబ సభ్యులందరినీ పిలిచి మాట్లాడి, అతి తక్కువ సమయంలోనే ఆ కుటుంబానికి న్యాయం అందించినందుకు బాధితురాలు పోలీసులకు కృతజ్ణతలు తెలిపారు. దీనికి కృషి చేసిన దిశ పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి రాజీవ్ కుమార్‌ని, ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్‌ని, ఎస్సై మస్తాన్ ఖాన్‌ని, సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు.