ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. నిద్రపోతున్న భర్తపై సలసల కాగే నూనె పోసింది. దీంతో అతని ముఖం, ఛాతి తీవ్రంగా కాలిపోవడంతో ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడుని ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని మదన్ గిర్ అనే ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పేరు దినేశ్. ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన తన ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తుండగా భార్య ఈ దారుణానికి పాల్పడింది.
బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఈ నెల 2న పని ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు. తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో శరీరంపై తీవ్రమైన మంట పుట్టడంతో అతడు ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా భార్య నిలబడి నూనె పోయడం చూసి షాక్‌కు గురయ్యాడు. అతను తేరుకునేలోపే, కాలిన గాయాలపై కారం చల్లింది. నొప్పితో కేకలు వేయబోగా, 'అరిస్తే ఇంకా నూనె పోస్తా' అని ఆమె బెదిరించినట్లు దినేశ్ తెలిపాడు. అయినా నొప్పిని భరించలేక అతను గట్టిగా అరవడంతో, శబ్దాలు విని ఇరుగుపొరుగు వారు, కింది అంతస్తులో ఉండే ఇంటి యజమాని కుటుంబం పైకి పరుగెత్తుకొచ్చారు.
దినేశ్ గాయాలు ప్రమాదకరమైనవని వైద్యులు వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహం కాగా, గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. రెండేళ్ల క్రితం భార్య క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ (సీఏడబ్ల్యూ) సెల్లో ఫిర్యాదు చేయగా, రాజీ కుదిరింది. ప్రస్తుతం ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఓ అధికారి తెలిపారు.