స్థానికుల సమాచారం మేరకు.. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల రావుల మల్లేశ్వరికి స్థానిక చొల్లంగికి చెందిన అప్పారావుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధల కారణంగా భర్తకు దూరమైన మల్లేశ్వరి తన మూడేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటోంది. అయితే మల్లీశ్వరి ఫంక్షన్లలో వంట సామగ్రి శుభ్రపరిచే పనులకు వెళుతూ జీవనం సాగించేంది.
ఈ క్రమంలో వంట సామగ్రిని తరలించే ఆటో డ్రైవర్ కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట చినమార్కెట్ వీధికి చెందిన బొడ్డు గంగాద్రి అలియాస్ బాబీతో మల్లీశ్వరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిద్దరి మధ్య సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ గత ఆరు నెలలుగా కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని పూలమార్కెట్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
అయితే, గత వారం రోజులుగా తన వద్దకు బాబీ రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులే తన ప్రియుడిని రానీయకుండా ఆపి ఉంటారని భావించింది. ఈ నేపథ్యంలో మల్లీశ్వరి సోమవారం తన తల్లి కుమారిని తీసుకుని రామారావుపేటలోని బాబి ఇంటికి వెళ్లింది. అక్కడ బాబి కనిపించకపోయేసరికి బాబిని తనతో పంపాలంటూ అతని తల్లిదండ్రులైన అమ్మాజీ, కామేశ్వరరావులను కోరింది.