అమరావతి : కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేఈ ప్రభాకర్ శుక్రవారం ఉదయం శాసనసభ భవనంలోని శాసనసభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూఖ్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత ప్రమాణస్వీకార పత్రంపై ప్రభాకర్ సంతకం చేశారు.
శాసనమండలి నియమావళిని చైర్మన్ ఫరూఖ్ ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి(బోయ) ఫెడరేషన్ చైర్మన్ బిటీ నాయుడు, శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.విజయరాజు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం శాసనసభా భవనం బయట ప్రభాకర్ మాట్లాడుతూ తను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకున్న పూర్వ అనుభవంతో పెద్దల సభలో వ్యవహరిస్తానని చెప్పారు. శిల్పా చక్రపాణి రెడ్డి కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.