ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ అప్పుల అప్పారావు ఉన్నారని, ప్రతి మంగళవారం అప్పు చేయకుంటే ఆయనకు నిద్రపట్టదని టీడీపీ సీనియర్ నేత, చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఏపీలో అప్పుల అప్పారావు జగన్ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లిలో తెదేపా జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను ఒప్పించి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్న అభిప్రాయాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేశారు.
జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి విసినిగిరి శ్రీనివాసరావు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు రౌతు కామునాయుడు, సారేపాక సురేష్‌కుమార్, తాడ్డి సన్యాసినాయుడు, చనమల మహేశ్వరరావు, మాజీ ఎంపీపీలు పైల బలరాం, వెన్నె సన్యాసినాయుడు, రెస్కో మాజీ ఛైర్మన్ దన్నాన రామచంద్రుడు, నాయకులు కోట్ల సుగుణాకరరావు, బలగం వెంకటరావు పాల్గొన్నారు.