శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో మొదటి సారిగా కివిఫ్రూట్, నెమలి ఈకలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపనతిరుమంజనంలో వివిధ రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అభయమిచ్చారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తుండగా, ప్రత్యేక మాలలను అలంకరించారు.
కివిఫ్రూట్ - ఫైనాపిల్, నెల్లికాయలు, బ్లాక్ వెల్వెట్, ముత్యాలు - నందివర్థనం, నెమలి ఈకలు, పవిత్రమాలలు, వట్టి వేరు, రోజ్ పెటల్స్‌తో తయారు చేసిన మాలలు, కిరీటాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
ఆకట్టుకున్న మొక్కజొన్న, యాపిల్ మండపం
స్నపనతిరుమంజనం నిర్వహించే రంగ నాయకుల మండపాన్నివివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ రోజ్ ఫ్లవర్స్, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, మొక్కజొన్నలు, యాపిల్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కమనీయంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు డిపి.అనంత, శేఖర్‌రెడ్డి, గోవిందహరి పాల్గొన్నారు.