కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

ఠాగూర్

బుధవారం, 26 మార్చి 2025 (10:33 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉంటున్న కొడాలి నానికి ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 
కొడాలి నాని గతంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఈ పరిస్థితుల్లో గుండె సమస్య కారణంగా ఇపుడు ఆయనకు ఛాతి నొప్పి వచ్చిందా? లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో వచ్చిందా? అనే కోణంలో వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. 
 
మరోవైపు, కొడాలి నాని ఆస్పత్రిలో చేరారనే సమాచారంతో వైకాపా శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళన చెందుతూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళుతున్నారు. అయితే, కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అధికారికంగా వెల్లడించాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు