నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

వరుణ్

శనివారం, 15 జూన్ 2024 (19:17 IST)
తన తండ్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసులు పెట్టిన తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా పెట్టొచ్చు కదా అని దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ప్రశ్నించారు. ఏపీ స్పీకరుగా పని చేసిన కోడెల శివప్రసాద్‌పై ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను సొంతానికి వినియోగించుకున్నారంటూ గత వైకాపా ప్రభుత్వం కేసు పెట్టి వేధింపులకు గురిచేసింది. ఈ మానసికక్షోభను అనుభవించలేక కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇపుడు ఏపీలో వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 
 
ఈ నేపథ్యంలో కోడెల శివరాం స్పందించారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయాలని కోడెల శివరాం ఓ ప్రకటనలో కోరారు. 'మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆరోజు ఫర్నిచర్‌ తన వద్ద ఉందని చెప్పకపోతే ఎవరికీ తెలియదు. ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని స్పీకర్‌కు లేఖ రాసిన తర్వాత ఆయనపై కేసు పెట్టారు. అప్పటి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఐపీసీ 409 సెక్షన్‌ కింద పదేళ్లు శిక్షపడే కేసు పెట్టారు. అదే జగన్‌ నేడు.. తాడేపల్లి, లోటస్‌పాండ్‌లో ఇళ్ల మరమ్మతుల కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలను కలవటానికి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజావేదిక కూల్చి వేశారు. ప్రస్తుతం జగన్‌ తన నివాసంలో సీఎంవో కింద తెచ్చిన ఫర్నిచర్‌ ఇచ్చేస్తానని కనీసం లేఖ రాయలేదు. ఇప్పటిదాక ఫర్నిచర్‌ ఇవ్వనందుకు కోడెలపై పెట్టిన కేసే జగన్‌ మీద పెట్టొచ్చు కదా!' అని ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు