ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకం.. కోడెలపై దాడి..

గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.


ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి.. వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డిలు మరణించారు.
 
ఏపీలో పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ మండిపడింది. ఈ విషయాన్ని సీఈవో ద్వివేది దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తోందంటూ ఆరోపించారు.

ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల జాబితాను ద్వివేదికి అందజేశారు. దాడులకు తెగబడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీపై ఫిర్యాదులో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు