మరోవైపు, ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే యువతరం కూడా పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారు ఎంతో ఉత్సాహం చూపిస్తూ గంటల కొద్దీ క్యూలైన్లలో నిలుచునివున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పల్లెల్లో మహిళా ఓటర్లు దండెత్తారు. అలాగే, యువత కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేస్తామంటున్నారు.
ఇదిలావుంటే, పోలింగ్ సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం మన సామాజిక బాధ్యత. రాష్ట్రం ప్రస్తుతం కీలక పరిస్థితుల్లో ఉంది. ఓటు వేయకుండా ఎవరూ అడ్డుకోలేరు. ఈవీఎంలు పనిచేయడంలేదని వెనుదిరగడం దురదృష్టకరం. వెళ్లినవాళ్లు మళ్లీ తిరిగివచ్చి ఓట్లు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వీవీ ప్యాట్ రశీదుల్లో ఎవరికి ఓటు పడిందో కూడా చెక్ చేయాలని సూచించారు. వేరే పార్టీకి ఓటుపడితే వెంటనే ఫిర్యాదు చేయాలన్న చంద్రబాబు.. ఈవీఎంలు పనిచేయక పోవడం, ప్రారంభమైన కొద్దిసేపట్లోనే మొరాయించడం, పార్టీల గుర్తులు మారడం, ఒకపార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పడటం, దుష్పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.