బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత... త్వరలో జేసీ దివాకర్ రెడ్డి కూడా...

మంగళవారం, 18 జూన్ 2019 (16:54 IST)
అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత పార్టీ మారిపోయారు. ఆమె తన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండుపా కప్పుకున్నారు. పైగా, తాను స్థాపించిన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. 
 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన గీత ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె... సొంతంగా జనజాగృతి అనే పార్టీని గత ఏడాది స్థాపించారు.
 
ఈ సందర్భంగా అమిత్ షా, రాంమాధవ్‌లకు ట్విట్టర్ ద్వారా గీత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వేదికగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అమిత్ షా నాయకత్వంలో పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.
 
మరోవైపు, టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అదేసమయంలో ఈ ప్రచారంపై జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందించడం లేదు. ఖండించడం కూడా లేదు. ఫలితంగా ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు