టీడీపీ మంత్రుల మధ్య ల్యాండ్ వార్ : చంద్రబాబు చెంతకు చేరిన పంచాయతీ

గురువారం, 15 జూన్ 2017 (11:36 IST)
విశాఖపట్టణం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల మధ్య చెలరేగిన ల్యాండ్ వార్ ముదిరిపాకానపడింది. ఫలితంగా ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ భూకుంభకోణం వెనుక నువ్వున్నావంటే నువవ్వున్నావని.. మంత్రులు గంటా శ్రీనివాస్, సీహెచ్. అయ్యన్నపాత్రుడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఇది పెద్ద వివాదాస్పదమైంది. కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నం భూ స్కామ్‌లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని మంత్రి అయ్యన్న ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా మంత్రికి లేఖాస్త్రం సంధించారు మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు.
 
గంటా శ్రీనివాస రావు రాసిన లేఖలో భూ స్కామ్‌పై సిట్టింగ్ జడ్జ్‌ లేదా... సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టకు అయ్యన్న నష్టం కలిగించారని గంటా తన లేఖలో ఆరోపించారు. గతంలోనూ అయ్యన్న వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదనే విచారణ కోరినట్లు లేఖలో పేర్కొన్న గంటా.. తనపై ఎలాంటి దర్యాప్తు జరిపినా ఆహ్వానిస్తానన్నారు. 
 
ఇదిలావుండగా, ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది. మంత్రులు గంటా, అయ్యన్న వివాదంపై సుమారు గంటపాటు చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై భేటీలో నిశితంగా చర్చించనున్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక, నంద్యాల ఉప ఎన్నికపై చర్చ జరగనుంది.  

వెబ్దునియా పై చదవండి