సామాజిక బాధ్యతగా ఇప్పటివరకు విద్య, వైద్యం వంటి విషయాల్లో విశేష సేవలందిస్తోన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఎల్.సి.ఐ.ఎఫ్) మునుపెన్నడూ చూడని కరోనా వైరస్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించేందుకు ముందుకు రావడం ముదావహమని జిల్లా కలెక్టర్ ఏయండి ఇంతియాజ్ అన్నారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం రూ.7.50లక్షలు విలువైన పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లును నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఇంతియాజ్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్ కట్టడి కోసం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మానవతా దృక్పదంతో ముందుకు వచ్చి జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లలో కరోనా వ్యాప్తి బారిన పడ్డవారికి చికిత్స అందజేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లు అందజేయడం ప్రశంసనీయమన్నారు.
ఇప్పటికే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ సామాజిక బాధ్యతగా ఎన్నో సేవలను అందించిందని కొనియాడారు. లయన్స్ జిల్లా గవర్నర్ వైపీసీ ప్రసాద్ (జిల్లా 316-డి) మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌కు అందజేయగా మిగిలిన పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లును అన్ని లయన్స్ క్లబ్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పీఐడి లయన్ చిగురుపాటి వరప్రసాద్,ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్‌కుమార్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దేవినేని జోనీకుమారి, పలువురు లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.