కరోనా సెకండ్ వేవ్ చాలా దారుణంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నా, ప్రభుత్వం మూర్ఖంగా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపడం విచారకరమన్నారు.
పరీక్షా కేంద్రాలే సూపర్ స్ప్రెడర్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులంతా హెచ్చరిస్తుంటే మూర్ఖంగా పరీక్షలు నిర్వహిస్తామనడం విచారకర నిర్ణయమన్నారు. మూర్ఖత్వానికి ఫ్యాంటు, షర్టూ వేస్తే అది జగన్ రెడ్డి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మొదటి దశలో యువతకు కరోనా సోకిన రేటు 11శాతం ఉంటే రెండో దశలో అది 40శాతం వరకూ ఉందని వివరించారు. కరోనా సాకుతో అసెంబ్లీ, శాసనమండలి నిర్వహించకుండా బడ్జెట్ ని ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన జగన్‌రెడ్డి సర్కారు, కరోనా వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతో తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి దూరం అయ్యానని ప్రకటన విడుదల చేసిన జగన్‌రెడ్డి, పరీక్షలు నిర్వహిస్తే లక్షలాది మంది పిల్లలకు కరోనా సోకుతుంది అనేది తెలియదా అని ప్రశ్నించారు.
తాను, తన పార్టీ నాయకులు మాత్రం భద్రంగా ఉండాలి, విద్యార్థులు బలవ్వాలా ? అని నిలదీశారు. ప్రాక్టికల్ పరీక్షల్లోనే సరైన కరోనా నివారణ చర్యలు పాటించకపోవటం వల్ల అనేకమందికి వ్యాధి సోకిందని, ఇప్పుడు లక్షలాది మందికి పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా వుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రోజూ తన ఇంటికి అధికారుల్ని రప్పించుకుని సమీక్ష చేస్తున్నామన్న మూర్ఖపు రెడ్డి, పరీక్షల నిర్వహణ మీద విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఎందుకు అభిప్రాయ సేకరణ చేయలేదని ప్రశ్నించారు. లక్షలాది మంది వలంటీర్లతో విద్యార్థుల నుంచి పరీక్షలు నిర్వహించాలో వద్దో అభిప్రాయ సేకరణ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు.
పరీక్షలు రద్దుకి 48గంటల్లో నిర్ణయం తీసుకోండి అని కోరితే.. పరీక్షలు, పిల్లల ప్రాణాల గురించి పట్టించుకోకుండా నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరీక్షల రద్దు డిమాండ్‌తో టిడిపి పెట్టిన వాట్సప్ నెంబర్ 9444190000కి లక్షా 50 వేల మందికి పైగానే విద్యార్థులు CBE2021 అనే మెసేజ్ పంపి పరీక్షలు వద్దనే అభిప్రాయం తెలియజేశారని, మరో 70 వేల మంది విద్యార్థులు, తల్లితండ్రులు వాట్సప్ ద్వారా పరీక్షలు ఎందుకు వద్దో వివరిస్తూ తమ అభిప్రాయాలను పంపారని చెప్పారు.
విద్యావేత్తలు, విద్యార్థులు, నిపుణులతో రేపు టౌన్‌హాల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, అందులో వచ్చిన అభిప్రాయాలను తీసుకుని అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడేది లేదన్నారు.
కేంద్రం, ఇతర రాష్ట్రాలన్నీ పరీక్షలు రద్దు చేస్తే జగన్‌రెడ్డి సర్కారు ఎందుకు మూర్ఖంగా పరీక్షల నిర్వహిస్తామంటోందో అర్థం కావడంలేదన్నారు. 20 నుంచి 40 శాతం ఇన్ఫెక్షన్ రేటున్న ప్రస్తుత భయంకర పరిస్థితుల్లో పరీక్షలు అంటే కరోనాని వ్యాప్తి చేయడమేనన్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున పరీక్షలు రద్దు చేయాలని, వాయిదా వేయాలని ప్రతిపక్షంగా మేము అడుగుతుంటే ..నన్ను తిట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని, నన్ను ఎంతైనా తిట్టండి..పరీక్షలు రద్దు చేసి పిల్లల ప్రాణాలు కాపాడాలని లోకేష్ కోరారు. తన విదేశీ చదువు, ఫీజుల చెల్లింపుల గురించి పదేపదే అనవసర ఆరోపణలు చేసే బదులు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మూర్ఖపురెడ్డిని అడిగితే ఆయనే సమాధానం ఇస్తాడన్నారు.
జగన్‌రెడ్డి తండ్రి తనపై ఇవే ఆరోపణలతో వేసిన కేసులు కోర్టు కూడా కొట్టేసిందన్నారు. అప్పట్లోనే నా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువు, ఫీజుల చెల్లింపు వివరాల పత్రాలన్నీ అసెంబ్లీలోనే చంద్రబాబు గారు ప్రకటించారని తెలియజేశారు.
జగన్‌రెడ్డి సర్కారు తాము తప్పుడు మార్గంలో వెళ్లేటప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు వాటిని డైవర్ట్ చేయడానికి అన్నట్టు ఇలా నాపై తప్పుడు ఆరోపణలతో వస్తారని ..నన్నుతిడితే ఉద్యమం వదిలేసి పారిపోతానని అనుకుంటున్నారని, ఇంకా గట్టిగా విద్యార్థుల తరఫున పోరాడతానని స్పష్టం చేశారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానమిస్తూ కరోనా రెండో దశ సునామీలా విజృంభిస్తోందని, కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందన్నారు. కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్యకు, శ్మశానాల్లో జరిగే అంత్యక్రియల సంఖ్యకు వ్యత్యాసం ఉంటోందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయన్నారు.
ప్రభుత్వం టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానం అమల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు కూడా దొరకని దుస్థితి నెలకొందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఏ ఆసుపత్రిలోనూ కరోనా చికిత్స అందట్లేదని ఆరోపించారు.
విశాఖ పట్నంలో ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం ప్రకటిస్తే..అదే రోజు ఒకే శ్మశానంలో 18 మంది కోవిడ్ మృతులకు అంత్యక్రియలు జరిగాయని దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో బెడ్లూ కూడా దొరకడంలేదని, ఆక్సిజన్ షార్టేజ్ మొదలైందని వీటిపై సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే..పరిష్కరించడం మానేసి మాపైనే ఎదురుదాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని మూర్ఖపురెడ్డి అని అనడం ఏంటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే.. ``ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. సీఎం మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాత్రం బయటకు రాడు..ఎవరు ఏమైపోయినా ఫరవాలేదనుకునే ముఖ్యమంత్రిని మూర్ఖపురెడ్డి అనకుండా ఏమనాలి`` అని ఎదురు ప్రశ్న వేశారు.
రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని, ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని, కోవిడ్ వచ్చినవారికి అవసరమైన ప్రోటోకాల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. టెలీమెడిసిన్ ద్వారా అవసరమైన మందులు ఇంట్లో వున్న కరోనా పేషంట్లకు అందివ్వొచ్చని చెప్పారు.