ఖాళీ కడుపుతో ఉంటే కరోనా వస్తుందా? డా౹౹ వేణు గోపాలరెడ్డి సమాధానాలు

శనివారం, 24 ఏప్రియల్ 2021 (14:14 IST)
ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్త " ఖాళీ కడుపుతో బయటకు వెళ్ళకండి...మీ కోసం కరోన పొంచి ఉంది" అని. ఇది పూర్తిగా సత్యదూరము, ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేని వార్త. ఉపవాసం ఉన్నవారికి వైరస్ తొందరగా సోకుతుంది అని ఇప్పటి వరకు ఏ పరిశోధన ప్రచురితము కాలేదు.
 
నిజానికి, ఉపవాసం ఉండటం వల్ల మానవ జీర్ణవ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఉపవాసం ద్వారా శరీరానికి అందే కెలోరీలు తగ్గినప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితం అవుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉపవాసంలో ఉన్నపుడు శరీరంలో తెల్లరక్త కణాలు గస్తీని, నిఘాను పెంచుతాయి, ఇది కోవిడ్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుందని పబ్ మెడ్ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 
ఉపవాసం అనేక మతాల్లో ఒక ముఖ్యమైన ఆచారం. ఉపవాసం రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక, ఒత్తిడిని తగ్గించడం, వార్ధక్యాన్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఎక్స్పెరిమెంటల్ జరంటలజీ జర్నల్ పేర్కొంది. ఉపవాస దీక్షలు తెల్ల రక్తకణాల గస్తీ, రోగ నిరోధక పెంపుదల లో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి కోవిడ్ పై పోరులో కీలకం కావచ్చు.
 
ఉపవాసం శరీరంలో ఇన్ఫలమాటివ్ చర్యలను తగ్గిస్తుంది. ఇది ఊబకాయులకు, ఆస్తమా, ఆర్థిరిటీస్ వ్యాధులున్నవారికి లాభదాయకంగా ఉంటుంది. ముస్లిములు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటం మూలంగా రోగనిరోధకత పెరగడం, కణాల పునరుత్తేజానికి దోహదం చేస్తుందని, కాన్సర్ వంటి వ్యాధులు నివరించబడతాయని PMC మెడికల్ జర్నల్ స్పష్టం చేసింది.
 
కోవిడ్ వైరస్ తెల్లరక్త కణాల గస్తీని నిరోధిస్తుంది, ఉపవాసం ద్వారా గస్తీ కణాలను ఉద్దేపనం చేయడం ద్వారా కరోనని ఎదుర్కొనవచ్చు. ఉపవాసం ద్వారా శరీరంలో కొవ్వు తగ్గుతుంది. దీని ద్వారా కోవిడ్ కేసులలో ఊబకాయుల్లో ప్రాణాంతకమైన cytokine stormని కూడా తగ్గించవచ్చని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ జర్నల్ ప్రచురించింది.
 
అంతే కాక కోవిడ్ కారక వైరస్ ని ఎదుర్కొనే అనేక  రసాయనాల ఉత్పత్తికి, నియంత్రణకు ఉపవాసం ఉపకరిస్తుంది.  మానవ రోగ నిరోధక వ్యవస్థ నుండి తప్పించుకోవడానికి కరోన అనేక వేషాలు వేస్తుంది..వాటి నియంత్రణ లో ఉపవాసం బాగా ఉపయోగపడుతుంది.
 
ఉపవాసం కరోన కట్టడికి ఉపకరిస్తుందని పూర్తిస్థాయి ప్రత్యక్ష సాక్షాలు అందుబాటులో లేనప్పటికీ, ఉపవాసం రోగనిరోధక వ్యవస్థని ఉత్తేజితం చేస్తుందని, గస్తీ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తనందని సాక్షలున్నవి. ఈ రెండు కూడా కరోన కట్టడిలో కీలకం. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసం ఉండటం ఆరోగ్యకరమే. ఉపవాసం ఉన్నవారు కూడా వాక్సిన్ తీసుకొనవచ్చును.
 
-Dr. A. Venu Gopala Reddy
MSc. PhD Microbiology
9948106198

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు