బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడివుందని భారత వాతావరణ శాఖ అమరావతి ప్రాంతీయ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగాై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలుతూ వెస్ట్ బెంగాల్, దానికి ఆనుకునివున్న ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని వివరించింది.
కాగా, ఈ అల్పపీడనంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్‌డేట్ ఇచ్చింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం వర్షపు నీటిలో మునిగిపోతోంది.