తిరుమలలో అష్టబంధన లేపనం తయారీ.. ఎలా చేస్తారంటే?

సోమవారం, 13 ఆగస్టు 2018 (17:07 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో మహా సంప్రోక్షణం జరుగుతోంది. శ్రీవారి ఆలయంలో శనివారం ప్రారంభమైన అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఏర్పాటు చేసిన కుంభానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో శనివారం మహా సంప్రోక్షణ సందర్భంగా ఆ రోజు వేకువజాము నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. శనివారం వేకువజాము 3గంటలకు ప్రారంభమైన వర్షం ఉదయం 10 గంటల వరకు భారీగా కురిసింది. ఈ నేపథ్యంలో మహా సంప్రోక్షణకు ముందు వర్షం పడటాన్ని కొంతమంది పండితులు శుభసూచికంగా భావిస్తున్నారు. ఈ వర్షంతో తిరుమల క్షేత్రం చల్లబడింది.
 
ఇక  పుష్కరానికోమారు వైష్ణవ ఆలయాల్లో జరిగే అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం తిరుమలలో కీలక దశకు చేరుకుంది. గర్భగుడిలోని మూల విరాట్టుకు సమర్పించే అష్టబంధన లేపనం తయారీని సోమవారం ఉదయం రుత్విక్కులు ప్రారంభించారు. ఎనిమిది దిక్కులకు సూచికలుగా ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి ఈ లేపనాన్ని తయారు చేస్తారు. ఈ లేపనం ఆరిన తరువాత అత్యంత గట్టిగా మారుతుంది. దీని కాఠిన్యం పుష్కరకాలం ఉంటుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి దీన్ని మూలవిరాట్టుకు సమర్పిస్తారు. 
 
ఈ లేపనాన్ని పవిత్ర ద్రవ్యాలైన శంఖ చూర్ణం, మధూచ్ఛిష్టం (తేనెపట్టు మైనం), లాక్ష, త్రిఫలం, కాసీనం, గుగ్గిలం, చూర్ణం, రక్తశిలలను తొలుత సమభాగాలుగా చేస్తారు. ఆపై ఈ మిశ్రమాన్ని వెన్నతో కలిపి, గోరువెచ్చని నీటితో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని మూలవిరాట్టు నిలబడి ఉండే పద్మపీఠం వద్ద ఎనిమిది దిక్కులలో వేస్తే ఈ క్రతువు పూర్తవుతుంది. 
 
చంద్రుడికి సూచికగా శంఖ చూర్ణం, రోహిణికి సూచికగా మధూచ్ఛిష్టం, స్కందుడికి సూచికగా చూర్ణం, అగ్నికి సూచికగా లాక్ష, చండదీధితికి సూచికగా గుగ్గిలం, హరికి సూచికగా త్రిఫలం, వాయువుకు సూచికగా కాసీనం, పృధ్వికి సూచికగా రక్తశిలను వాడతారు. అష్టబంధనం సమర్పించిన తరువాత ఆనంద నిలయం మరింత తేజోవంతమై, మరో 12 సంవత్సరాల పాటు ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుందని విశ్వాసం.
 
కలియుగ దైవం విగ్రహాన్ని ఆగమానుసారం పున:తేజోవంతం చేయడానికి ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు 60 ఏళ్ల క్రితం మొదలైంది. అప్పటినుంచి నిరాఘాటంగా పన్నెండేళ్లకొకసారి ఈ ఉత్సవాన్ని టీటీడీ వేడుకగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, పద్మపీఠం స్థిరంగా ఉండడం వెనుక దివ్య విశేషం ఉందని పెద్దలు చెబుతారు. స్వామి విగ్రహం అచంచలంగా ఉంటుంది. విగ్రహం చుట్టూ ఎనిమిది దిక్కులు స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి అష్టదిగ్బంధనం చేస్తారు. దీన్నే అష్టదిగ్బంధనం అంటారు. 
 
అష్టబంధన ద్రవ్య కాఠిన్యం పుష్కర కాలమే ఉంటుందనీ, ఆ తర్వాత స్వామి విగ్రహానికి దివ్యశక్తినీ, తేజస్సునూ మళ్ళీ ఆవాహన చేయాలనీ, సువర్ణాన్ని తిరిగి తేజోవంతం చేయాలని, అష్టబంధనం నశిస్తే దేశానికే అరిష్టమనీ ఆగమ శాస్త్రం చెప్తోంది. అందుకే 12 ఏళ్ళకొకసారి స్వామి గర్భాలయంలో మరమ్మతులు, పీఠానికి బంధనం, విమాన నవీకరణ తదితర జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు